తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

September 16, 2021
img

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కేరళకు చెందిన సుప్రసిద్ద ఆభరణాల సంస్థ మలబార్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు, మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్‌ బుదవారం హైదరాబాద్‌ వచ్చి రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వ్యాపారానికి, పెట్టుబడులకు అనుకూలంగా ఉండటం, ప్రభుత్వం ప్రోత్సాహం, అన్ని రంగాలలో నైపుణ్యం కలిగిన పనివారు లభిస్తుండటం వంటి అనేక సానుకూలతలు ఉన్నందున రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు వారు తెలిపారు. తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 260 షో రూమ్స్ ఉన్నాయని, వాటికి అవసరమైన వెండి,బంగారు, వజ్రాభరణాల తయారు చేసే యూనిట్‌, గోల్డ్ రిఫైనరీ యూనిట్‌లను తెలంగాణలో నెలకొల్పనున్నట్లు మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్‌ తెలిపారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2,500 మంది స్వర్ణకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.  

తమ ప్రభుత్వంపై నమ్మకముంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్‌ మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Related Post