హైదరాబాద్‌ మెట్రోను గట్టెక్కించేందుకు కమిటీ ఏర్పాటు

September 15, 2021
img

కరోనా, లాక్‌డౌన్‌లతో దేశంలో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వ్యవస్థ కూడా ఒకటి. లాక్‌డౌన్‌ ఎత్తేసి మెట్రో రైళ్ళను తిప్పుతున్నప్పటికీ నగరవాసులు కరోనా భయంతో మెట్రోలో ప్రయాణించేందుకు వెనకాడుతున్నారు. దీంతో మెట్రో ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులు పెరిగి నష్టాలపాలవుతోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర నష్టాలలో మునిగిపోయిన హైదరాబాద్‌ మెట్రోకు ప్రజాధారణ కరువవడంతో నేటికీ కోలుకోలేకపోతోంది. 

కనుక మెట్రోపై భారీ పెట్టుబడి పెట్టి నడిపిస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని అర్ధించింది. ఆ సంస్థ ప్రతినిధులు నిన్న ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ని కలిసి తమ గోడు మొరపెట్టుకొన్నారు. సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ మెట్రోను తప్పకుండా ఆదుకొంటామని వారికి హామీ ఇచ్చారు. నగరంలో మెట్రోను మరింత విస్తరించడం ద్వారా మెట్రోకు అదనపు ఆదాయాన్ని సృష్టించే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. 

హైదరాబాద్‌ మెట్రోను నష్టాల ఊబిలో నుంచి బయటకు లాగేందుకు తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం చేసేందుకు సిఎం కేసీఆర్‌ తక్షణం మంత్రులు, వివిద శాఖల ఉన్నతాధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

ఈకమిటీలో మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ఆర్ధికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ సభ్యులుగా ఉంటారు.

Related Post