తెలంగాణలో నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు

September 02, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పెంచిన రిజిస్ట్రేషన్, సేవల ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్స్ శాఖ బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితమే రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. 

నేటి నుంచి స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల కొరకు సేల్ లేదా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేసుకోవాలంటే (ఆస్తి విలువలో 0.5శాతం) కనీసం రూ.5,000 నుంచి గరిష్టంగా లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అదే డెవలప్మెంట్ అగ్రిమెంట్ , జీపీయేలకైతే (ఆస్తి విలువలో 0.5 శాతం) కనీసం రూ.2,000 నుంచి 25,000 వరకు చెల్లించాలి.

ఇప్పటివరకు ఈసీ, సర్టిఫైడ్ కాపీలకు రూ.200 ఛార్జీ వసూలు చేస్తుండగా, నేటి నుంచి రూ.500 చెల్లించవలసి ఉంటుంది. ముప్పై ఏళ్ళకు పైబడిన ఈసీలు కావాలంటే అదనంగా మరో రూ.500 కలిపి వెయ్యి చెల్లించుకోవలసిందే. మార్కెట్‌లో వాల్యూ సర్టిఫికేట్ కావాలంటే రూ.100 చెల్లించుకోవాలి. 

సొసైటీల రిజిస్ట్రేషన్లకు రూ.2,000, డాక్యుమెంట్ ఫైలింగ్ కొరకు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లీజు, లైసెన్సుల కొరకు 0.2 శాతం ఫీజు చెల్లించాలి. 

రిజిస్ట్రేషన్స్ శాఖ నిన్న జారీ చేసిన ఉత్తర్వులలో కుటుంబ సభ్యులు అంటే ఎవరనేది కూడా స్పష్టంగా పేర్కొంది. తల్లితండ్రులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాలు, తాత, అవ్వ, దత్తత తీసుకొన్న కొడుకులను కుటుంబ సభ్యులుగా పేర్కొంది. 

Related Post