హైదరాబాద్‌ మెట్రోలో ఎల్&టి వాటా అమ్మకం?

September 01, 2021
img

కరోనా దెబ్బకు హైదరాబాద్‌ మెట్రో సంస్థ తీవ్రంగా నష్టపోయింది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత మెట్రో రైళ్ళు తిరుగుతున్నప్పటికీ మునుపటిలా రోజుకి 3-4 లక్షల మంది ప్రయాణించడం లేదు కనుక రాబడి కంటే నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటంతో ఇంకా నష్టపోతూనే ఉంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో తమ 90 శాతం వాటాలో కొంత అమ్ముకొనేందుకు ఎల్&టి సంస్థ సిద్దపడుతోంది. ఈవిషయం ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్) డీకే సేన్ స్వయంగా మంగళవారం ప్రకటించారు. 

వివిద రాష్ట్రాలలో తమ సంస్థకున్న పలు ప్రాజెక్టులలో నష్టాలలో ఉన్నవాటిని లేదా తక్కువ లాభసాటిగా ఉన్నవాటిలో వాటాలను అమ్ముకొని బయటపడాలని భావిస్తున్నట్లు సేన్ తెలిపారు. ఆవిదంగా వచ్చిన సొమ్మును తమకు కీలకంగా ఉన్న వ్యాపారాలు, ప్రాజెక్టులలో పెట్టడం మంచిదని భావిస్తున్నట్లు సేన్ తెలిపారు. ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలలో తమ విద్యుత్ ప్రాజెక్టులలో, హైదరాబాద్‌లోని మెట్రో ప్రాజెక్టులో వాటాలు అమ్ముకోవాలని భావిస్తున్నామని సేన్ తెలిపారు. హైదరాబాద్‌ మెట్రోలో రాష్ట్ర ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉంది. 

లాభసాటిగా ఉన్నవాటినైతే సులువుగా అమ్ముకోవచ్చు కానీ ఎన్నటికీ వీడని కరోనా కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులో వాటాను కొనేందుకు ఎవరు ముందుకు వస్తారు? అసలు ఈవిదంగా మెట్రో రైళ్ళను ఎంతకాలం నడిపించగలరు?అనే సందేహాలు కలుగకమానవు.

Related Post