తెలంగాణలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు

July 22, 2021
img

తెలంగాణలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో నేటి నుంచి అన్నిరకాల భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల విలువను ఆయా ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతం వరకు పెంచింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. ఈ పెంపు నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తుంది. ఈ నెల 20వ తేదీ తరువాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణీలో దరఖాస్తు చేసుకొన్నవారికి కూడా ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ధరణీ పోర్టల్లో ‘అధనపు చెల్లింపులు’ అనే పేరుతో ఆప్షన్ కూడా ఏర్పాటుచేసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకొన్నవారు ధరణీలో లాగిన్ అవగానే అదనంగా ఎంత చెల్లించాలో చూపుతుంది. ఆ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవలసి ఉంటుంది. 

నివాస, వాణిజ్య భూముల రిజిస్ట్రేషన్ల కొరకు వినియోగిస్తున్న ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో కూడా పెరిగిన ఛార్జీల ప్రకారం అవసరమైన మార్పులు చేశారు. నేటి నుంచి ఆ ప్రకారమే చెల్లించవలసి ఉంటుంది.

• ఇప్పటి వరకు బుక్‌వాల్యూ ప్రకారం ఏకరాకు రూ.10,000 ఉన్న వ్యవసాయ భూముల కనిష్ట ధరను రూ. 75,000కు పెంచాలని నిర్ణయించారు. వీటిలో మూడు స్లాబులుంటాయి. ఆ ప్రకారం కనిష్ట ధరను వరుసగా 30,40,50 శాతం చొప్పున పెంచుతున్నట్లు సమాచారం.   

• లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో నివాస స్థలాల కనిష్ట ధర చదరపు గజానికి రూ.1,000గా నిర్ణయించారు. 

• గ్రామీణ ప్రాంతాలలో చదరపు గజం రూ.200, మండల కేంద్రాలలో మరియు 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల పరిధిలో రూ.300 కనిష్ట ధరగా నిర్ణయించారు. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో చదరపు గజం కనిష్ట ధర రూ.400గా నిర్ణయిచ్చారు. 

• రాష్ట్రంలోని భూములను గ్రామీణ ప్రాంతాలు మొదలు కార్పొరేషన్ స్థాయి వరకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. ఆ ప్రకారం కనిష్ట ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

• వేములవాడ (వీటిడీఏ), యాదాద్రి (వైటీడీఏ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ(కూడా) పరిధిలోని వ్యవసాయ భూములను 5 కేటగిరీలుగా విభజించి వాటికి వేరేగా ధరలు నిర్ణయించారు. 

• వీటిడిఏ మినహా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చదరపు గజానికి రూ.500 చొప్పున, హెచ్ఎండీఏ-1లో కనిష్ట ధర రూ.1,500, హెచ్ఎండీఏ-2లో రూ.800, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.3,000 కనిష్ట ధరలను నిర్ణయించారు.

• అన్ని ప్రాంతాలలో అన్ని రకాల భూముల గరిష్ట ధరలను మూడు శ్లాబులుగా విభజించారు. హైదరాబాద్‌లో కమర్షియల్ ప్రాంతంగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం గరిష్ట ధర రూ.65,000 ఉంది. దానిని రూ.74,500కి పెంచారు. 

Related Post