తెలంగాణలో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆకాశానికి

July 18, 2021
img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని జిల్లాలు హైదరాబాద్‌తో పోటీ పడుతూ సమాంతరంగా అభివృద్ధి చెందుతుండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ గత ఏడేళ్ళుగా ప్రభుత్వం భూముల ధర(మార్కెట్‌లో వాల్యూ)ను పెంచలేదు. దాంతో మార్కెట్లో అమ్ముడవుతున్న ధరలకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మద్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దీనివలన ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతోంది. కనుక నివాస స్థలాలు, వ్యవసాయ భూముల ధరలను పెంచేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ చేసిన ప్రతిపాదనలపై మంత్రి వర్గసమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేశారు. తాజా సమాచారం ప్రకారం.... 

• ఇప్పటి వరకు బుక్‌వాల్యూ ప్రకారం ఏకరాకు రూ.10,000 ఉన్న వ్యవసాయ భూముల కనిష్ట ధరను రూ. 75,000కు పెంచాలని నిర్ణయించారు. వీటిలో మూడు స్లాబులుంటాయి. ఆ ప్రకారం కనిష్ట ధరను వరుసగా 30,40,50 శాతం చొప్పున పెంచుతున్నట్లు సమాచారం.   

• లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో నివాస స్థలాల కనిష్ట ధర చదరపు గజానికి రూ.1,000గా నిర్ణయించారు. 

• గ్రామీణ ప్రాంతాలలో చదరపు గజం రూ.200, మండల కేంద్రాలలో మరియు 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల పరిధిలో రూ.300 కనిష్ట ధరగా నిర్ణయించారు. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో చదరపు గజం కనిష్ట ధర రూ.400గా నిర్ణయిచ్చారు. 

• రాష్ట్రంలోని భూములను గ్రామీణ ప్రాంతాలు మొదలు కార్పొరేషన్ స్థాయి వరకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. ఆ ప్రకారం కనిష్ట ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

• వేములవాడ (వీటిడీఏ), యాదాద్రి (వైటీడీఏ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ(కూడా) పరిధిలోని వ్యవసాయ భూములను 5 కేటగిరీలుగా విభజించి వాటికి వేరేగా ధరలు నిర్ణయించారు. 

• వీటిడిఏ మినహా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చదరపు గజానికి రూ.500 చొప్పున, హెచ్ఎండీఏ-1లో కనిష్ట ధర రూ.1,500, హెచ్ఎండీఏ-2లో రూ.800, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.3,000 కనిష్ట ధరలను నిర్ణయించారు.

• అన్ని ప్రాంతాలలో అన్ని రకాల భూముల గరిష్ట ధరలను మూడు శ్లాబులుగా విభజించారు. హైదరాబాద్‌లో కమర్షియల్ ప్రాంతంగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం గరిష్ట ధర రూ.65,000 ఉంది. దానిని రూ.74,500కి పెంచారు. 

పెంచిన ఈ ధరలు ఆగస్ట్ 1వ తేదీ నుంచి లేదా ఇంకా ముందుగానే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. భూముల ధరలతో పాటు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీగా పెరుగబోతున్నాయి. ప్రస్తుతం 6 శాతం ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు త్వరలో 7.5 శాతానికి పెరుగబోతోంది. ప్రభుత్వం భూముల కనిష్ట ధరలు పెంచడంతో మార్కెట్లో ధరలు కూడా ఆ మేరకు లేదా ఇంకా భారీగా పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల మరింత భారం కానుంది. 

Related Post