ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కోసం భారత్‌ బయోటెక్ ప్రయత్నాలు

June 19, 2021
img

ఈ నెల 23న ప్రపంచ ఆరోగ్య సంస్థతో భారత్ బయోటెక్ ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు. భారత్‌లో ఇప్పటికే కోట్లాదిమందికి ఈ వ్యాక్సిన్‌ ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందనందున విదేశాలలో ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతించడం లేదు. కనుక విదేశాలలో కూడా కోవాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి పొందేందుకు భారత్‌ బయోటెక్ కోవాక్సిన్‌ ఫార్ములా, దానికి సంబందించి క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాల వివరాలు, భారత్‌లో డీసీజీఐ ఇచ్చిన అనుమతి పత్రాలు వగైరాలను ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేయనున్నారు. దీనికి సంబందించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసింది. 

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వాక్సిన్లకు చాలా డిమాండ్ ఉన్నందున భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ విదేశాలకు కూడా సరఫరా చేసి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కానీ భారత్‌ అవసరాలకు సరిపడే వాక్సిన్లు తయారుచేయలేకపోతున్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందడంలో ఆలస్యం చేసి ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, విదేశాలు ఈ వ్యాక్సిన్‌ను గుర్తించనందున భారత్‌లో ఈ వాక్సిన్ వేసుకొని విదేశాలకు వెళ్లాలనుకొనేవారికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదీగాక త్వరలో భారత్‌లో అనేక కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే కోవాక్సిన్‌కు పోటీ పెరుగుతుంది కనుక అప్పుడు విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేసి ఆ లోటును పూడ్చుకొనే అవకాశం ఉంటుంది. కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు భావించవచ్చు. 

Related Post