మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ళ నియామకం

June 17, 2021
img

ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా చేస్తున్న మన తెలుగురాష్ట్రాలకు చెందిన సత్య నాదెళ్ళ ఆ సంస్థకు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవల సమావేశమైన మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలుపడంతో సత్య నాదెళ్ళ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 

సత్య నాదెళ్ళ 2014లో స్టీవ్ బామర్ స్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీని పలురంగాలకు విస్తరింపజేసి మరింత అభివృద్ధి చేశారు. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో మైక్రోసాఫ్ట్ తిరుగులేని ఆధిపత్యం సంపాదించగలిగింది. అలాగే సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత లింక్డ్ ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, జెనీమాక్స్ వంటి ఇతర అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మైక్రోసాఫ్ట్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేశారు. 

ఆయన వ్యాపార వ్యూహాలు, కంప్యూటర్స్ సాఫ్ట్‌వేర్‌కే పరిమితమైన మైక్రోసాఫ్ట్ కంపెనీని వివిద రంగాలకు విస్తరించడం, ముఖ్యంగా వివిద రంగాలలో టెక్నాలజీ వినియోగావకాశాలను ముందుగా పసిగట్టి ఆయా రంగాలకు మైక్రోసాఫ్ట్ సంస్థను విస్తరించడం వంటివి సత్య నాదెళ్ళకు ఆ సంస్థలో ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని కల్పించాయని చెప్పవచ్చు. ఇదంతా కేవలం ఏడేళ్ళలో వ్యవధిలోనే చేసి చూపించిండంతో మైక్రోసాఫ్ట్ సంస్థకు ఛైర్మన్‌గా సత్య నాదెళ్ళ కంటే అర్హుడైన వ్యక్తి మరొకరు లేరనే నమ్మకం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలగడంలో ఆశ్చర్యం లేదు. 

ఒకప్పుడు బిల్ గేట్స్ కూర్చోన్న కుర్చీలో మన తెలుగువాడు సత్య నాదెళ్ళ కూర్చొని మైక్రోసాఫ్ట్ సంస్థను నడిపిస్తుండటం భారతీయులందరికీ ముఖ్యంగా మన తెలుగువారందరికీ గర్వ కారణం. 

Related Post