త్వరలో మరో భారత్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి

May 08, 2021
img

ప్రస్తుతం భారత్‌లో కోవీషీల్డ్, కోవాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ మరియు ఆ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ దిగుమతి చేసుకొంది. కనుక త్వరలోనే ఆ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తుంది. 

ఈ మూడు కాకుండా భారత్‌లోనే తయారైన మరో వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్-డి పేరుతో ఓ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. దాని మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ కూడా పూర్తయ్యాయి. కనుక భారత్‌లో అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకొంటోంది. 

మే నెలాఖరులోగా అనుమతులు లభిస్తే వెంటనే జైకోవ్-డి వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆ సంస్థ ఎండీ డాక్టర్ శార్విల్ పటేల్ తెలిపారు. నెలకు కోటి వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. ఈ టీకాను మూడుసార్లు తీసుకోవలసి ఉంటుంది. మొదటి డోస్ తీసుకొన్న నెలరోజుల తరువాత రెండో డోస్, మళ్ళీ మరో నెల తరువాత మూడో డోస్ వేసుకోవలసి ఉంటుదని తెలిపారు. ఈవిదంగా చేయడం వలన రోగనిరోధక శక్తి మరింత ఎక్కువ పెరగడంతో పాటు శరీరంలో ఎక్కువ కాలం యాంటీబాడీలు నిలిచి ఉంటాయని చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ మరో విశేషమేమిటంటే, దీనిని వేసుకొన్న తరువాత ఎటువంటి నొప్పి కలుగదు. ఈ వ్యాక్సిన్‌ను మరింత అభివృద్ధి చేసి రెండు డోసుల వ్యాక్సిన్‌గా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ శార్విల్ పటేల్ తెలిపారు. 

జైడస్ క్యాడిలా తయారుచేసిన విరాఫిన్ అనే ఔషదాన్ని కరోనా మద్యస్థ స్థాయి చికిత్సకు ఉపయోగించేందుకు ఇటీవలే డిసిజిఐ అనుమతించింది. 

Related Post