జగిత్యాల మామిడిపళ్ళు ఢిల్లీకి రవాణా

April 12, 2021
img

దేశంలో వివిద రాష్ట్రాల నుంచి వ్యవసాయోత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, పెద్ద నగరాలకు తరలించేందుకు రైల్వేశాఖ కిసాన్ రైల్ పేరిట ప్రత్యేక గూడ్స్ రైళ్ళను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి నేడు జగిత్యాల నుంచి ఢిల్లీకి బయలుదేరాబోతోంది.

జగిత్యాలలో పండే మామిడిపళ్ళకు ఉత్తరాది రాష్ట్రాలలో చాలా డిమాండ్ ఉండటంతో, వాటిని  కిసాన్ రైల్‌ ద్వారా ఢిల్లీకి రవాణాచేసేందుకు దక్షిణమధ్య రైల్వే శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది. దీంతో జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలలో మామిడిపళ్ళను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి వ్యాపారులు వచ్చి వాలిపోతున్నారు.

సోమవారం రాత్రి 11 గంటలకు జగిత్యాల (లింగంపేట రైల్వేస్టేషన్‌) నుంచి మొట్టమొదటి కిసాన్ రైల్ మామిడిపళ్ళను తీసుకొని ఢిల్లీకి బయలుదేరనుంది. ఈ గూడ్స్ రైలులో 20 వ్యాగన్లలో మొత్తం 460 టన్నుల మామిడికాయలను ఢిల్లీకి పంపిస్తున్నామని రైల్వే అధికారులు చెప్పారు. మళ్ళీ ఈ నెల 14వ తేదీన ఒకటి, 19వ తేదీన మరొక కిసాన్ రైల్ జగిత్యాల నుంచి మామిడిపళ్ళను తీసుకొని ఢిల్లీకి బయలుదేరుతాయి. మామిడికాయల సీజన్ పూర్తయ్యే వరకు జగిత్యాల-ఢిల్లీ మద్య ఈ కిసాన్ రైలును నడిపించాలనుకొంటున్నట్లు తెలిపారు.

కిసాన్ రైలులో మామిడిపళ్ళ రవాణా ఛార్జీలపై రైల్వేశాఖ 50 శాతం రాయితీ ఇస్తుండటం, 24 గంటలలోగా అవి భద్రంగా ఢిల్లీకి చేరుకొంటుండటం, రోడ్డు మార్గం ద్వారా రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోవడం వలన తాము కిసాన్ రైల్ ద్వారానే ఢిల్లీకి మామిడిపళ్ళను రవాణా చేయాలని నిశ్చయించుకొన్నట్లు మామిడిపళ్ళ వ్యాపారులు చెపుతున్నారు. మళ్ళీ ఢిల్లీ నుంచి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్, కశ్మీర్ తదితర ప్రాంతాలకు వాటిని రవాణా చేస్తుంటామని వ్యాపారులు తెలిపారు.

గత ఏడాది రాష్ట్రం నుంచి లక్షల టన్నుల బియ్యం దేశంలో వివిద రాష్ట్రాలకు ఎగుమతైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నానాటికీ వ్యవసాయం పెరుతున్నందున మున్ముందు ఇంకా అనేక వ్యవసాయోత్పత్తులు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో గొర్రెలు, మేకలు, చేపలు వగైరాల పెంపకం కూడా బాగా పెరిగినందున మాంస ఉత్పత్తులు కూడా రవాణా అయ్యే అవకాశాలున్నాయి.

Related Post