ఇక ఆధార్ ప్రూఫ్ ఆవిధంగా కూడా చూపవచ్చు

September 13, 2017
img

రైళ్ళలో రిజర్వేషన్స్ కోసం ఆధార్ వివరాలు సంపర్పించడానికి ఇంతవరకు ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకువెళ్ళవలసి వచ్చేది. కానీ ఇక నుంచి మొబైల్ ఫోన్ లో ఆధార్ వివరాలను చూపించినా సరిపోతుంది. అయితే మొబైల్ ఫోన్ లో కెమెరాతో స్కానింగ్ లేదా ఫోటో తీసుకొని చూపిస్తే కుదరదు. దీని కోసం యు.ఐ.ఏ.ఐ. ప్రారంభించిన ‘ఎం-ఆధార్‌’ మొబైల్‌ యాప్‌ ను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అది కూడా మనం ఆధార్ కార్డు తీసుకొన్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ను నమోదు చేసుకొన్నామో ఆ నెంబరు గల ఫోన్ లో మాత్రమే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ‘ఎం-ఆధార్’ యాప్ ను ఓపెన్ చేసి దానిలో మన పాస్ వర్డ్ ను ఎంటర్ చేసినట్లయితే, మన ఆధార్ నెంబర్, ఫోటోతో  సహా కనిపిస్తుంది. దానిని టిటికి చూపించితే సరిపోతుంది. ప్రయాణం హడావుడిలో ఇంట్లో ఆధార్ కార్డు మరిచిపోయి రైలు ఎక్కేసినవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మున్ముందు ఈ మొబైల్-ఆధార్ ప్రూఫ్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంగీకరించవచ్చు. 

హైదరాబాద్ లో ఆధార్ ఆన్ వీల్స్: 

ఒకప్పుడు ఆధార్ కార్డు నమోదుకు ప్రజలు చాలా ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు అంత ఒత్తిడి ఎక్కడా కనబడదు. అయినప్పటికీ దేశంలో అనేకమంది వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు నేటికీ ఆధార్ కార్డు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసమే ‘ఆధార్ ఆన్ వీల్స్’ సేవలకు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఎవరైనా ఆధార్ కార్డు పొందాలనుకొంటే 040-2311 9266 నెంబర్‌కు ఫోన్ చేసినట్లయితే ఆధార్ వాహనం వారి ఇంటి వద్దకే వచ్చి నమోదు చేసుకొని ఆధార్ కార్డ్ జారీ చేస్తారని తెలిపారు. హైదరాబాద్ జంట నగరాలలో ఉన్న వృద్ధులు ఎవరైనా ఈ మొబైల్ సేవలు ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. 

Related Post