హైదరాబాద్‌ మెట్రోలో స్వల్ప ప్రమాదం

October 19, 2019
img

హైదరాబాద్‌ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్‌-మియాపూర్‌ మద్య నడుస్తున మెట్రో రైల్‌లో తలుపుల పైభాగంలో బిగించబడిన ప్యానెల్ బోర్డు ఊడిపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మెట్రో రైల్‌ ఖైరతాబాద్‌ చేరుకొన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మెట్రో అధికారులు వెంటనే స్పందించి దానిని మళ్ళీ యధాస్థానంలో బిగింపజేశారు. దానికి అమర్చిన రెండు స్క్రూలు ఊడిపోవడం వలన ప్యానల్ బోర్డు పడిపోయినట్లు తెలుస్తోంది. 

ఇది స్వల్ప ప్రమాదమే అయినప్పటికీ మీడియాలో చాలా ముఖ్యవార్తగా రావడం విశేషం. రాష్ట్రానికే గర్వకారణంగా ఉన్న హైదరాబాద్‌ మెట్రో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులకు అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తూ దేశంలో అత్యుత్తమ మెట్రోలలో ఒకటిగా నిలుస్తోంది. మూడేళ్ళ వ్యవధిలోనే అనేక అవార్డులు కూడా అందుకొంది. హైదరాబాద్‌ మెట్రోకు నానాటికీ ప్రజల ఆధరణ కూడా పెరుగుతూనే ఉంది. అటువంటి హైదరాబాద్‌ మెట్రోపై మీడియాలో ఒకవర్గం ఎందుకు కక్ష కట్టిన్నట్లు వ్యవహరిస్తుందో తెలియదు కానీ మెట్రోలో ఏ చిన్న సమస్య తలెత్తినా దానిని భూతద్ధంలో నుంచి చూపిస్తూ మెట్రోలో ఏదో అనర్ధాలు జరిగిపోతున్నట్లు వార్తలు ప్రసారం చేస్తుండటం బాధాకరం. దాని వలన వారికి ఏమి లాభం, ఆనందం కలుగుతుందో తెలియదు కానీ హైదరాబాద్‌ మెట్రో ప్రతిష్ట దెబ్బ తింటుంది. అది మనకు గౌరవం కాబోదు. 

కనుక హైదరాబాద్‌ మెట్రోలో ఏవైనా లోపాలు, సమస్యలు కనబడినట్లయితే వాటి గురించి అపవాదులు ప్రచారం చేసే బదులు తక్షణం మెట్రో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగలిగితే వారు ఆ సమస్యను తక్షణం పరిష్కరిస్తారు. మెట్రోలో బయటపడుతున్న ఇటువంటి సమస్యలు మెట్రో ప్రతిష్టను దెబ్బ తీస్తాయి కనుక మెట్రో అధికారులు, సిబ్బంది కూడా నిత్యం మెట్రో రైళ్ళను,  స్టేషన్‌లను, మెట్రో కారిడర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడం చాలా అవసరం లేకుంటే మీడియాలో ఒక వర్గం హైదరాబాద్‌ మెట్రోపై బురద జల్లెందుకు కాసుకు కూర్చోందని గుర్తుంచుకోవాలి. అవసరమైతే ప్రయాణికుల నుంచి రోజూ సమస్యలపై పిర్యాదులు స్వీకరించే వ్యవస్థను ప్రతీ మెట్రో స్టేషన్‌వద్ద ఏర్పాటు చేస్తే మరీ మంచిది. మెట్రోను ఎంతగానో ఆదరిస్తున్న నగర ప్రజలు కూడా మెట్రోలో కనబడిన సమస్యలను తక్షణమే మెట్రో స్టేషన్‌లో సిబ్బందికి తెలియజేయగలిగితే ఇటువంటి ప్రమాదాలు, సమస్యలను నివారించడంలో హైదరాబాద్‌ మెట్రోకు తోడ్పడినవారవుతారు. ఇది మన బాధ్యత ఎందుకంటే ఇది మన కోసం నడుస్తున్న మన మెట్రో కనుక.

Related Post