చంద్రుడి ఉపరితలం ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

October 18, 2019
img

చంద్రయాన్-2లో భాగంగా ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ చంద్రుడి ఉపరితలం ఫోటోలను తీసి పంపించింది. వాటిలో చంద్రుడి ఉతరార్ధగోళంపై ఉన్న గుంతలు వగైరా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్బిటర్ పంపిన ఫోటోలన్నీ శాస్త్రీయ అధ్యయనానికి అవసరమైన నిర్ధిష్టమైన ప్రమాణాలతో ఉండటంతో వాటి ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై లభించే అమూల్యమైన ఖనిజాలను గుర్తించడానికి వీలుగా 3డి మ్యాపులు రూపొందిస్తున్నారు.

ఆర్బిటర్‌లో అమర్చిన ఇమేజింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోమీటర్‌తో 800 నానోమీటర్ల నుంచి 5,000 నానోమీటర్ల పరిధిలో చాలా స్పష్టమైన ఫొటోలను తీసినట్లు ఇస్రో ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఆర్బిటర్ తీసిన తాజా ఫోటోలను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై పడుతున్న సూర్యకాంతి, అది ఉపరితలంపై పడి పరావర్తనం (రిఫ్లక్షన్) చెందుతున్న తీరు ఆధారంగా మరికొన్ని శాస్త్రీయమైన పరిశోధనలు చేపట్టవచ్చునని ఇస్రో తెలియజేసింది.

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్ చేయడంలో విఫలమైనప్పటికీ, ఆర్బిటర్ నుంచి చాలా అమూల్యమైన సమాచారం అందుతుండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Related Post