కరీంనగర్‌ టి-హబ్‌ అక్టోబర్‌లో ప్రారంభం

September 17, 2019
img

హైదరాబాద్‌కే పరిమితమైన ఐ‌టి సంస్థలను తెలంగాణలో అన్ని జిల్లాలకు వ్యాపింపజేయాలనే ఉద్దేశ్యంతో వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో ఐ‌టి హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. అవన్నీ వివిద దశలలో ఉన్నాయని రాష్ట్ర ఐ‌టి మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వీటి గురించి తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెపుతూ, “తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో వచ్చిన తరువాత 2015లో టీ-హబ్‌-1ను ప్రారంభించాము. దాని ద్వారా 500 స్టార్ట్ అప్‌లు వచ్చాయి. వాటిద్వారా సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రం ఏర్పడక మునుపు హైదరాబాద్‌లో కేవలం రెండు ఇంక్యుబెటర్లు మాత్రమే ఉండేవి. కానీ టీ-హబ్‌ ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్రంలో కొత్తగా 55 ఇంక్యుబెటర్లు వచ్చాయి. టీ-హబ్‌ సాధిస్తున సత్ఫలితాలు చూసి దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా టీ-హబ్‌ నెలకొల్పడంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు తీసుకొంటున్నాయి. 

టీ-హబ్‌-1 విజయవంతం అయినందున ఇప్పుడు టీ-హబ్‌-2ను ప్రారంభించబోతున్నాము. కరీంనగర్‌లో రూ.33.5 కోట్లు వ్యయంతో నిర్మితమవుతున్న టీ-హబ్‌ను వచ్చే నెల ప్రారంభించబోతున్నాము. అలాగే టీ-హబ్‌-2లో భాగంగా రాయదుర్గం వద్ద రూ. 276.22 కోట్లు వ్యయంతో మూడెకరాలలో 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన టీ-హబ్‌-2ను ఏర్పాటు చేయబోతున్నాము. ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద టీ-హబ్‌గా నిలుస్తుంది. సుమారు 4,000 మందికి ఉపయోగించుకునేవిధంగా దీనిని నిర్మిస్తున్నాము,” అని చెప్పారు.

Related Post