చంద్రుడి కక్ష్యలో ప్రవేశించిన చంద్రయాన్‌-2

August 20, 2019
img

జూలై 22వ తేదీన శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్ర (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 కొద్దిసేపటి క్రితం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. క్లిష్టమైన ఈ ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తిచేసింది. భూకక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-2 కొద్దిరోజుల క్రితం చంద్రుడి కక్ష్యవైపు మళ్లించి ఈరోజున దానిని చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టడంతో ఈ సుదీర్గ ప్రయాణంలో ఒక కీలక మైలురాయి దాటింది. నేటి నుంచి చంద్రయాన్-2ను 5 దశలలో చంద్రుడికి దగ్గరగా తీసుకువెళ్లే ప్రక్రియమొదలు పెడతారు. ఆవిధంగా చంద్రుడికి 100 కిమీ పరిధిలోకి తీసుకువెళ్లిన తరువాత సెప్టెంబర్ 7వ తేదీన చంద్రయాన్-2 నుంచి ఆర్బిటర్ విడిపోతుంది. అది చంద్రుడి దక్షిణదృవం చేరుకున్నప్పుడు దానిలో నుంచి విక్రమ్ అనే ల్యాండర్ విడిపోయి మెల్లగా చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. చంద్రయాన్-2లో ఇదే అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియ. ఇది విజయవంతమైతే చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైనట్లే.

విక్రమ్ లో అమర్చిన ప్రగ్యాన్ అనే రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్ల పరిధిలో రెండువారాల పాటు తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. అది పంపించే డాటాను ఆర్బిటర్ ఇస్రోకు పంపిస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రయోగంలో అన్ని దశలు సజావుగా సాగిపోతున్నందున ఈ చివరిదశ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. 

Related Post