ఇస్రో ఖాతాలో మరో విజయం

May 22, 2019
img

భారత్‌లో విజయానికి కేరాఫ్ అడ్రస్ ఏదంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అని చెప్పుకోవలసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ఖాతాలో నేడు మరో విజయం నమోదైంది. 

బుదవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ-46 ఉపగ్రహవాహక నౌక రిశాట్-2బి ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలో కక్షలో ప్రవేశపెట్టింది. 

పీఎస్‌ఎల్వీ సీ-46 పొడవు: 44.4 మీటర్లు, ఉపగ్రహం మరియు ఘన ఇందనంతో కలిపి మొత్తం బరువు: 290 టన్నులు (టన్ను=1,000కేజీలు). 

ఇంత భారీ వాహనం నింగిలోకి అలవోకగా రివ్వున దూసుకుపోయి కేవలం 15.29 నిమిషాలలో భూమికి 557కిమీ ఎత్తులో గల కక్షలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 

ఈ రిశాట్-2బి ఉపగ్రహం భారత్‌కు అంతరిక్షంలోని నిఘా నేత్రంగా చెప్పుకోవచ్చు. భారత్‌ సరిహద్దుల వద్ద, సముద్రజలాలలో శత్రువుల కదలికలను, ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించి సమాచారం అందిస్తుంటుంది. కనుక ఇకపై పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు భారత్‌లో చొరబడే ప్రయత్నాలు చేస్తే ఆ విషయం ముందుగానే సరిహద్దు భద్రతాదళాలకు సమాచారం అందుతుంటుంది కనుక వారిని నిలువరించగలరు. అలాగే ఇది ప్రకృతి విపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆయా ప్రాంతాలలో పరిస్థితులు గుర్తించి సమాచారం అందిస్తుంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ళపాటు భారత్‌కు సేవలందిస్తుంది.

Related Post