ఆన్ లైన్ బ్యాంకింగా అమ్మో..నాకు భయం!

March 16, 2018
img

నోట్లరద్దు జరిగినప్పటి నుంచి దేశప్రజలందరినీ బలవంతంగా నగదురహిత లావాదేవీలు చేసేలా చేస్తోంది కేంద్రప్రభుత్వం. ‘దాని వలన ఎన్నో ఉపయోగాలు...ప్రయోజనాలున్నాయంటూ’ విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా అనేక మొబైల్ యాప్స్ ను కూడా ప్రవేశపెట్టాయి. అయితే ఇంటర్నెట్ తో మొబైల్ ఫోన్స్ కనెక్ట్ అయినప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ లోని వ్యక్తిగత సమాచారానికి ఎటువంటి భద్రత లేకుండాపోయిందనే చేదు నిజం అందరికీ తెలిసిందే. 

ఇక కంప్యూటర్ల ద్వారా ఆన్-లైన్ లావాదేవీలు నిర్వహించేవారి వ్యక్తిగత సమాచారం కూడా ఎక్కడో విదేశాలలో ఉన్న హ్యాకర్స్ కు చేరిపోతోంది. పైగా నేటికీ దేశంలో కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఆన్-లైన్ లావాదేవీల గురించి అవగాహన లేనివారు కోకొల్లలున్నారు. ఈ కారణాల చేత నిత్యం ఆన్-లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వేలాదిమంది ప్రజలు తమ డబ్బును పోగొట్టుకొంటూనే ఉన్నారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నగదురహిత లావాదేవీలు చేయమని ప్రోత్సహించే ముందు పటిష్టమైన ఆన్-లైన్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దాని కోసం కేంద్రం సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. కానీ దాని అధినేత గుల్షన్ రాయ్ కే తాము కల్పిస్తున్న సైబర్ సెక్యూరిటీ మీద ఏ మాత్రం నమ్మకం లేదని అయన మాటలే చెపుతున్నాయి. 

కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్  అధ్యక్షతన నిన్న డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో గుల్షన్ రాయ్ మాట్లాడుతూ, “ఎంత పటిష్టమైన సైబర్ భద్రత ఏర్పాటు చేసినా ఆన్-లైన్ మోసాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. కనుక ఆన్-లైన్ లావాదేవీలు చేసేవారు తమ జాగ్రత్తలో తాము ఉండటం చాలా మంచిది. డెబిట్, క్రెడిట్ కార్డులతో చేస్తున్న లావాదేవీలలోనే అనేక మోసాలు జరుగుతున్నాయి. వాటి గురించి వచ్చే పిర్యాదులను పరిష్కరించడమే కష్టంగా మారుతోంది. ఇక ఆన్-లైన్ లావాదేవీలలో మోసాలు జరుగకుండా ఉంటాయా? అందుకే నేను ఆన్-లైన్ లావాదేవీలకు ఎప్పుడూ దూరంగా ఉంటాను. ఎప్పుడైనా డబ్బు అవసరం పాడినప్పుడు డెబిట్ కార్డు ఉపయోగించి ఎటిఎం నుంచి తీసుకొంటుంటాను,” అని చెప్పారు. 

ఈ మాటలు ఒక సాధారణ రాజకీయ నాయకుడు చెప్పినా అందరూ తప్పుపడతారు. కానీ దేశప్రజలకు సైబర్ భద్రతపై భరోసా కల్పించవలసిన ఆ సంస్థ అధినేతే ఈవిధంగా మాట్లాడటం చాలా సోచనీయమే. ఆయనకే తన భద్రతా వ్యవస్థపై నమ్మకం లేకపోతే ఇక సామాన్యపౌరుల పరిస్థితి ఏమిటి?

Related Post