క్రీడాశాఖే ఆటగాళ్ళతో గేమ్స్ ఆడుతోందేమిటి?

December 08, 2017
img

భారత్ నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన ఒక బాలికల హాకీ టీం ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడేందుకు రెండుమూడు రోజుల క్రితం ఆ దేశానికి చేరుకొంది. కానీ అక్కడకు చేరుకొన్న తరువాత వారిని పట్టించుకొనే నాధుడు కనబడకపోవడంతో ఆ బాలికలకు, వారి కోచ్ కు ఏమి చేయాలో పాలుపోలేదు. వారు చేసేదేమీ లేక తమకు ఏర్పాటు చేసిన హోటల్ చేరుకొని మర్నాడు తెల్లవారుజామునే లేచి సిద్దం అయ్యారు.  వారు బస చేసిన హోటల్ బయట ఎంతసేపు ఎదురుచూసినా వారిని తీసుకువెళ్ళడానికి ఏ వాహనం రాలేదు. అప్పుడు వారి కోచ్ అధికారులను సంప్రదించగా, మెట్రో రైల్ ఎక్కి మ్యాచ్ జరిగే ప్రాంతానికి చేరుకోవలసిందిగా ఉచిత సలహా పడేసి ఫోన్ పెట్టేశాడని బాలికలు చెప్పారు. అధికారులు తమకు కనీసం త్రాగడానికి మంచినీళ్ళు, ఆహారం కూడా ఏర్పాటు చేయలేదని వాపోయారు. 

చివరికి అతికష్టం మీద మ్యాచ్ జరిగే ప్రాంతానికి చేరుకోగలిగారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైనందున తమను మ్యాచ్ లో పాల్గొననివ్వలేదని ఆ బాలికలు వాపోయారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన తాము ఎంతో కష్టపడి ఇంతవరకు రాగలిగామని, కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దేశం కాని దేశంలో మ్యాచ్ ఆడలేకపోగా అష్టకష్టాలు పడ్డామని ఆ బాలికలు కన్నీళ్లు పెట్టుకొన్నారు. 


ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాకు చేరడంతో నెటిజన్స్ క్రీడాశాఖ అధికారులపై మండిపడుతూ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టడంతో క్రీదాశాఖా మంత్రి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన అధికారులు ట్వీట్టర్ ద్వారా చెప్పిన సమాధానం విని ఆ బాలికలే కాదు అందరూ షాక్ కు గురికాక తప్పదు. 

“మంత్రిగారి ఆదేశాల మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేయగా తేలిందేమిటంటే, ఆ బాలికల హాకీ టీం ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం తరపున కానీ ‘ది హాకీ ఇండియా’ సంస్థ తరపున గానీ ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. సోషల్ మీడియాలో ప్రదర్శితమవుతున్న ఆ వీడియోలో కోచ్ గా పేర్కొనబడిన వ్యక్తికి కూడా ‘ది హాకీ ఇండియా’ సంస్థ గుర్తింపు కానీ అనుమతి గానీ లేవు,” అని సమాధానం తెలిపింది. 


ఆ బాలికల హాకీ టీం భారత్ తరపున వెళ్ళిన బృందం కాదని, ఒక కళాశాల తరపున ఆస్ట్రేలియాలోని కళాశాలలతో హాకీ పోటీలో పాల్గొనడానికి వెళ్లిందని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వాదన. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ అనే స్వతంత్ర సంస్థ సాధారణంగా అటువంటి పోటీలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. అది ‘ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్’ అనే సంస్థతో కలిసి ఇటువంటి క్రీడాపోటీలు నిర్వహిస్తుంటుందని కనుక ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. 

ఈ ఘటనతో క్రీడాశాఖకు సంబంధించిన ఎవరికీ సంబంధం లేదని అధికారులు చేతులు దులుపుకోవడం విస్మయం కలిగిస్తుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన ఆ బాలికలు వారంతట వారుగా ఆస్ట్రేలియా వెళ్ళరు కదా? వారిని ఎవరు అక్కడికి తీసుకువెళ్ళినా అది క్రీడాశాఖకు సంబంధించిన విషయమే కదా? ఆ శాఖ ఆమోదం ఉన్న ఏదో ఒక సంస్థేవారిని అంతదూరం తీసుకువెళ్ళినప్పుడు, వారికి అక్కడ సౌకర్యాలు కల్పించి, వారు ఆ ఆటలలో పాల్గొని మళ్ళీ క్షేమంగా వారివారి తల్లితండ్రులకు అప్పగించవలసిన బాధ్యత దానిదే కదా? ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వంలో వివిధ శాఖలు సమన్వయంతో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. దేశం కాని దేశంలో తెలిసీతెలియని వయసులో ఉన్న బాలికలు అష్టకష్టాలు పడుతుంటే వారిని ఆదుకోవలసిందిపోయి, ఈవిధంగా దానితో తమకు సంబంధం లేదంటే..తమకూ లేదని అధికారులు చేతులు దులుపుకోవడం చాలా దారుణం. 

Related Post