పాకిస్తాన్ తో క్రికెట్ మాకు ముఖ్యం కాదు: భారత్

November 23, 2017
img

వచ్చే ఏడాది భారత్ లో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగవలసి ఉంది. దానిలో పాకిస్తాన్ కూడా పాల్గొనవలసి ఉంది. అయితే భారత్ గడ్డపై పాక్ జట్టును అనుమతించలేమని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం స్పష్టం చేశారు. “మాకు దేశం కంటే పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటం ముఖ్యం కాదు. దేశం ముందు. క్రికెట్ తరువాత..” అని అన్నారు. 

ఇంతకాలం పాకిస్తాన్ లో గృహ నిర్బంధంలో ఉంచబడిన ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి హఫీజ్ సయీద్ కు పాక్ కోర్టు స్వేచ్చ ప్రసాదించింది. అతను ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బలమైన సాక్ష్యాధారాలు లభించనందున, అతనిని విడుదల చేస్తున్నట్లు పాక్ కోర్టు ప్రకటించింది. 

అతను విడుదల కాగానే మొట్టమొదట చేసిన ప్రసంగంలో, భారత్ చెర నుంచి కాశ్మీర్ ను విడిపించేందుకు తన పోరాటం కొనసాగిస్తానని చెప్పాడు. భారత్ ఒత్తిడి కారణంగానే తనపై ఇంతకాలం గృహనిర్బందం విదించబడినట్లు భావిస్తున్నానని చెప్పాడు. భారత్ విషయంలో తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ప్రకటించాడు. అంటే భారత్ పై మళ్ళీ తప్పకుండా ఉగ్రవాద దాడులు చేస్తానని హెచ్చరించినట్లుగానే భావించవచ్చు. పాక్ ద్వందవైఖరి, అతని రెచ్చగొట్టే మాటల కారణంగా భారత్ ఆగ్రహం చెందడం సహజమే. అందుకే వెంటనే ఈవిధంగా స్పందించింది. 

Related Post