పాపం..శ్రీశాంత్!

October 18, 2017
img

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా జీవితకాల నిషేధానికి గురైన కేరళ క్రికెటర్ శ్రీశాంత్ పరిస్థితి మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ఆయనపై బిసిసిఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు ఆగస్ట్ 7న రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే దానిపై బిసిసిఐ అప్పీలు చేసుకొనగా అదే హైకోర్టు ప్రధాన న్యాయమూరి జ‌స్టిస్‌‌ నవనీత్ ప్రసాద్ సింగ్, జస్టిస్ రాజా విజయ రాఘవన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆగస్ట్ 7న జ‌స్టిస్‌‌ మహ్మద్‌ ముస్తాక్‌ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిన్న కొట్టివేసింది. ఇదివరకు ఇచ్చిన తీర్పు తరువాత మళ్ళీ క్రికెట్ ఆడే అవకాశం లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న శ్రీశాంత్ కు నిన్నటి తీర్పు పెద్ద షాక్ వంటిదేనని చెప్పవచ్చు. దీనిపై అయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే న్యాయస్థానాన్ని వేలెత్తి చూపలేరు కనుక బిసిసిఐ నిర్ణయంపై స్పందిస్తూ, “ఇది అత్యంత చెత్త నిర్ణయం. బిసిసిఐలో నాకొక్కడికే ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించారా? స్పాట్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మాటేమిటి? లోధా నివేదికలో పేర్కొన్న ఆ 13 మంది సభ్యుల సంగతేంటి? నిజమైన దోషులకు ఎటువంటి శిక్షలు ఉండవా? వారికి ఈ నియమనిబంధనలు ఏవీ వర్తించవా? ఈ విషయంలో నాకు నా అభిమానులు, కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. బిసిసిఐ నాపై విధించిన జీవితకాల నిషేధంపై నేను న్యాయ పోరాటం కొనసాగిస్తాను. త్వరలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో  అప్పీలు చేస్తాను,” అని అన్నారు. 

గత ఏడాది కేరళ శాసనసభ ఎన్నికలకు ముందు శ్రీశాంత్ భాజపాలో చేరి పోటీ చేశాడు కానీ కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో గెలిచి ఉంటే ఏమయ్యేదో కానీ ప్రస్తుతం మాత్రం ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదు. కేరళలో అడుగుపెట్టి నిలద్రొక్కుకోవాలని కలలు కంటున్న భాజపా అధిష్టానం, ఈ వ్యవహారంలో శ్రీశాంత్ కు సహాయపడకపోవడం విచిత్రంగానే ఉంది. కేంద్రప్రభుత్వం తలుచుకొంటే శ్రీశాంత్ ఈపాటికి మళ్ళీ టీం ఇండియాలో ఉండేవాడని చెప్పనవసరం లేదు. కానీ భాజపా ఎందుకో ఈవిషయంలో శ్రీశాంత్ కు సహాయపడటం లేదు. పాపం...శ్రీశాంత్! 

Related Post