టీమ్ ఇండియా కోచ్ ఎవరో?

July 10, 2017
img

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఫైనల్స్ లో పాక్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయిన తరువాత టీమ్ ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే పదవి నుంచి తప్పుకొన్నాడు. కనుక అతని స్థానంలో కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. టీమ్ ఇండియా కోచ్ గా పనిచేయడానికి రవి శాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, లాల్ చంద్ రాజ్ పుట్, టామ్ మూడీ, రిచర్డ్ పిబాస్, ఫిల్ సిమ్మన్స్ ముందుకు వచ్చారు. వారిలో ఒక్క సిమ్మన్స్ తప్ప మిగిలిన వారినందరినీ ప్రత్యక్షంగా లేదా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా బిసిసిఐ తరపున సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ లతో కూడిన ముగ్గురు సభ్యుల సెలక్షన్ ప్యానల్ సోమవారం ఇంటర్వ్యూలు చేశారు. కానీ ఇంతవరకు కోచ్ గా ఎవరి పేరు ప్రకటించలేదు.

 కోచ్ పేరును అత్యవసరంగా ప్రకటించనవసరం లేదని గంగూలీ అన్నారు. టీమ్ ఇండియా విరాట్ కోహ్లీ, మరికొందరు క్రికెటర్లతో మాట్లాడిన తరువాత అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ఎంపిక చేస్తామని సౌరవ్ గంగూలీ మీడియాకు చెప్పారు. కనుక కోచ్ నియామకం కోసం మరికొన్ని రోజులు సమయం తీసుకోవాలనుకొంటున్నట్లు గంగూలీ చెప్పారు. ఆ పదవిపై ఆసక్తి చూపిస్తున్న వారి వ్యవహార శైలి ఏవిధంగా ఉండబోతోందో కెప్టెన్ విరాట్ కోహ్లీకి తెలియజెప్పడం అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. అంతవరకు ప్రస్తుతం ఉన్న టీమ్ లో ఎటువంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తామని గంగూలీ చెప్పారు. కనుక శ్రీలంకతో మ్యాచ్ కు బయలుదేరేలోగానే కోచ్ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం కనబడటం లేదు.

ఇప్పుడు కోచ్ గా ఎంపిక చేయబడే వ్యక్తే 2019లో జరుగబోయే వరల్డ్ కప్ పోటీలలో టీమ్ ఇండియాను గెలిపించే విధంగా శిక్షణ ఈయవలసి ఉంటుంది. అందుకే కోచ్ ఎంపికలో మరికొంత సమయం తీసుకొని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 

Related Post