ఫుట్‌బాల్ మాంత్రికుడు డిగో మారడోనా ఇకలేడు

November 26, 2020
img

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు డిగో ఆర్మండో మారడోనా బుదవారం (60) తన స్వదేశమైన అర్జెంటీనాలో గుండెపోటుతో కనుమూశాడు. ఫుట్‌బాల్‌ ఆటగాడిగా డిగో మారడోనా ఎంతో పేరు, డబ్బు, అవార్డులు సాధించి, ఎవరూ చేరుకోలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకొన్నప్పటికీ మాదకద్రవ్యాలకు అలవాటుపడి వాటికి బానిసగా మారిపోవడంతో అధఃపాతాళానికి పడిపోయి తీరని అప్రదిష్ట, అవమానాలు, తీవ్ర ఆరోగ్యసమస్యలు చేజేతులా తెచ్చిపెట్టుకొని చనిపోయాడు. 

డిగో మారడోనా తీవ్ర ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవడంతో రెండువారాల క్రితమే మెదడుకు శస్త్రచికిత్స చేశారు. కానీ కోలుకోలేక బుదవారం తుదిశ్వాస విడిచాడు. 

అతను మైదానంలో అడుగుపెడితే ప్రత్యర్ధులకు గుబులు పుట్టేదంటే అతిశయోక్తి కాదు. మెరుపు వేగంతో గోల్స్ చేస్తూ తన జట్టుకు విజయాలు సాధిస్తుండేవాడు. అందుకే అతనికి ‘ఫుట్‌బాల్ మాంత్రికుడు’, ‘ఫుట్‌బాల్ దేవుడు’ అని అభిమానులు పిలుస్తుండేవారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులకు ఆయన ఆరాధ్య దైవంగా నిలిచాడు. భారత్‌తో సహా పలుదేశాలలో యువత ఫుట్‌బాల్ ఆటపై ఆసక్తి పెంచుకోవడానికి ఆయనే కారకుడంటే అతిశయోక్తి కాదు. 

డిగో మారడోనా 1960, అక్టోబర్ 30వ తేదీన అర్జెంటీనా దేశంలో లానస్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 1973లో అర్జెంటీనా జూనియర్స్ 12ఏళ్ళ విభాగంతో కలిసి ఆడాడు. అప్పుడు అతని అద్బుతమైన ఆట చూసి నిర్వాహకులు అతనితో మాట్లాడగా అప్పుడు అతని వయసు కేవలం 8 ఏళ్ళే అని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచే డిగో మారడినోకు ఫుట్‌బాల్‌ ఆటలో శిక్షణ పొందుతూ తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకొని ఓ అద్భుతమైన క్రీడాకారుడిగా రాణించాడు. తొలుత తన దేశం తరపున ఆడిన డిగో మారడోనా ఆ తరువాత వివిద దేశాలలోని ఫుట్‌బాల్‌ క్లబ్బుల తరపున కూడా ఆడేడు. అందుకోసం ఆ క్లబ్బులు ఆరోజుల్లోనే డిగో మారడోనాకు కోట్లాదిరూపాయలు చెల్లించేవి. ఆరోజులో ఆ పారితోషికం కూడా గొప్ప రికార్డుగా నిలిచిపోయింది.     

డిగో మారడోనా విజయప్రస్థానం:  

సుమారు 20 ఏళ్ళపాటు తన అద్భుతమైన ఆటతో యావత్ ప్రపంచాన్ని అలరించిన 1986లో ప్రపంచకప్ పోటీలో ఇంగ్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చేసిన ఓ గోల్ ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ అనే పేరుతో డిగో మారడోనాను ఫుట్‌బాల్‌ దేవుడిగా మార్చేసింది. ఫుట్‌బాల్‌ ఆటలో డిగో మారడోనా సాధించిన విజయాలు, పథకాలు, డబ్బుకు, కీర్తి ప్రతిష్టల గురించి వ్రాయాలంటే ఓ పెద్ద పుస్తకమే అవుతుంది. 

డిగో మారడోనా పతనం:   

ఫుట్‌బాల్‌ ఆటలో అత్యున్నత శిఖరాలకు చేరిన డిగో మారడోనా వ్యక్తిగత జీవితంలో అధఃపాతాళానికి పడిపోవడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేని చేదు నిజం. అనేకమంది అమ్మాయిలతో శారీరిక సబంధాలు, మత్తుమందులకు బానిస కావడం, ఆ కారణంగా ఆటకు దూరం కావడం, ఆ వ్యసనాల నుంచి బయటపడే సమయంలో అతిగా ఆహారం తినడం వలన ఊబకాయం, దాంతో మళ్ళీ అనేక ఆరోగ్య సమస్యలతో సతమయ్యేడు. తరచూ ఆసుపత్రిలో చేరవలసివచ్చేది. ఊబకాయం తగ్గించుకొనేందుకు ఆపరేషన్ కూడా చేయించుకొన్నాడు. 

 డిగో మారడోనా వంటి అద్భుతమైన ఆటగాడు మైదానంలో దిగినప్పుడు ప్రేక్షకులు అతని నుంచి అటువంటి అద్భుతమైన ఆటనే ఆశిస్తారు. కానీ ఊబకాయం కారణంగా గతంలోలాగ ఆడలేక అవమానాలపాలయ్యాడు. డోపింగ్ టెస్టులో దొరికిపోయి అప్రదిష్టపాలయ్యాడు. చివరికి ఆ వ్యసనాలే అతనిని అధఃపాతాళానికి పడిపోయేలా చేసి చివరికి ప్రాణాలు కూడా బలిగొన్నాయి. అతని ఆట గురించి చెప్పుకొనేందుకు ఏవిధంగా ఓ పుస్తకమే వ్రాయాలో అతని పతనం గురించి చెప్పుకోవాలన్నా మరో పెద్ద పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది. దానిని బట్టి డిగో మారడోనా జీవితం ఏవిధంగా సాగి ముగిసిందో అర్ధం చేసుకోవచ్చు.  

ఏదిఏమైనప్పటికీ, ఫుట్‌బాల్‌ చరిత్రలో డిగో మారడోనా పేరిట ఒక అధ్యాయమే ఉంటుంది. తమ ఆరాధ్యదైవం డిగో మారడోనా చనిపోవడంతో అర్జెంటీనా ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు. డిగో మారడోనా మృతికి సంతాపంగా అర్జెంటీనా ప్రభుత్వం మూడు రోజులు దేశవ్యాప్తంగా సంతాపదినాలుగా ప్రకటించింది.

Related Post