క్రికెట్‌కు ఇక శలవు: ధోని

August 16, 2020
img

భారత్‌ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు శనివారం రాత్రి ఇంస్టాగ్రాం ద్వారా ప్రకటించాడు. ఆయన ప్రకటించేవరకు ఈవిషయం బీసీసీఐతో సహా ఎవరికీ తెలియదు. 

“నా క్రికెట్ ప్రస్థానంలో ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తూ నాకు అండగా నిలిచిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు రాత్రి 7.29 గంటల నుంచి ఇక నేను రిటైర్ అయినట్లు భావించండి,” అని ధోనీ చాలా క్లుప్తంగా చిన్న సందేశం పెట్టి అత్యంత నిరాడంబరంగా క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. 

అది చూసి ఆయన అభిమానులు, అతని క్రికెట్ సహచరులు, క్రికెట్‌తో సహా వివిద రంగాలకు చెందిన ప్రముఖులు షాక్ అయ్యారు. ధోనీ శిష్యుడు, ఆప్తమిత్రుడైన సురేశ్ రైనా చాలా తీవ్రంగా స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నిమిషాలకే అతను కూడా క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 

“నీతో కలిసి ఆడటం కంటే నాకు ఏదీ గొప్పవిషయం కాదు. నీ ఈ ప్రస్థానంలో నేను కూడా నీతో కలిసి నడవాలనుకొంటున్నాను. భారత్‌కు కృతజ్ఞతలు. జైహింద్,” అని సురేశ్ రైనా ఇంస్టాగ్రామ్‌లో సందేశం పెట్టి గురువు బాటలోనే అత్యంత నిరాడంబరంగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు.   

నిజానికి ధోనీ వరల్డ్ కప్ తరువాత నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటుండటంతో అతను రిటైర్ కాబోతున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. కానీ త్వరలో జరుగబోయే ఐపిఎల్ మ్యాచ్‌లలో ఆడేందుకు చెన్నైలో ప్రాక్టీస్ మొదలుపెట్టడం ద్వారా ఆ ఊహాగానాలకు చెక్ పెట్టాడు. కానీ కరోనా కారణంగా ఐపిఎల్ మ్యాచ్‌లు వచ్చే నెలకు, ప్రపంచ కప్ పోటీలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ధోనీ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. సరిగ్గా ఐపిఎల్ మ్యాచ్‌లకు నెలరోజుల ముందు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచంలో కలకలం చెలరేగింది. 

ధోనీ రిటైర్మెంట్ గురించి ఎవరేమన్నారంటే... 

ధోనీ భార్య సాక్షి సింగ్‌: “మీ విజయాలను చూసి మేమందరం గర్వపడుతున్నాము. క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న సందర్భంగా మీకు అభినందనలు. మీకెంతో ఇష్టమైన క్రికెట్‌ను విడిచిపెట్టడానికి మీకు ఎంత మనోవేదన అనుభవించారో నాకు తెలుసు. మీరు కన్నీళ్లను దిగమింగుకొని ఈ నిర్ణయం ప్రకటించారని నాకు తెలుసు. కానీ ఇకపై మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ మాటలను ప్రజలు మరిచిపోతారేమో కానీ వాళ్లకు మీరు అందించిన అనుభూతులు ఎప్పటికీ మరిచిపోలేరు,” అని సాక్షిసింగ్‌ చాలా భావోద్వేగంతో మెసేజ్ పెట్టారు. 

గవాస్కర్: క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన సారధులలో కపిల్ దేవ్ సరసన ధోనీ నిలుస్తారు.   

సచిన్ టెండూల్కర్: నీతో కలిసి 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడం నా జీవితంలో మరువలేని క్షణాలు. రెండో ఇన్నింగ్స్ (రిటైర్మెంట్ తరువాత జీవితం)లో నీకు శుభాకాంక్షలు.  

విరాట్ కోహ్లీ: ప్రపంచం నీ గొప్పతనం చూసింది. నేను నీ వ్యక్తిత్వం చూశాను. 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ: క్రికెట్‌లో ఓ గొప్ప శకం ముగిసింది. భారత్‌తో సహా క్రికెట్ ప్రపంచానికి లభించిన అత్యుత్తమ ఆటగాడు ధోనీ. 

వివిఎస్ లక్ష్మణ్: ఓ చిన్న పట్టణం నుంచి మ్యాచ్ విన్నర్‌గా... గొప్ప కెప్టెన్‌గా నీ ప్రస్థానం అత్యద్భుతం.       

కేంద్రహోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా: ప్రపంచం మీ హెలికాఫ్టర్ షాట్స్ మిస్ అవుతుంది.

Related Post