ఫుట్ బాల్ అభిమానులకు శుభవార్త!

July 07, 2020
img

కరోనా భయంతో క్రికెట్‌తో పాటు అన్ని ఆటలు...పోటీలు నిలిచిపోవడంతో క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతుండటంతో ఇక ముందైనా జరుగుతాయో లేవో ఎవరూ చెప్పలేకపోతున్నారు. భారత్‌లో క్రికెట్‌  తరువాత అత్యంత ప్రజాధారణ పొందిన ఆట ఫుట్ బాల్. ఇటువంటి సమయంలో ఇండియన్ సూపర్ లీగ్ ఓ శుభవార్త చెప్పింది. 

ఈ ఏడాది నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా నేపధ్యంలో ఈసారి ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాలలో ఈ మ్యాచులు నిర్వహించబోతున్నట్లు తెలియజేసింది. అంతేకాదు ఐఎస్ఎల్ సీజన్-2020-2021లో కొన్ని మార్పులు కూడా చేసింది. ఈ సీజనులో ప్రతీ ఫ్రాంచైజీలో గరిష్టంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే తీసుకోవచ్చు. ప్రతీ ఆరుగురిలో ఒక ఆసియా ఆటగాడు కూడా తప్పనిసరని తెలిపింది. ఈసారి గోవా, కేరళ రాష్ట్రాలు ఐఎస్ఎల్ సీజన్-2020-2021 నిర్వహించేందుకు పోటీ పడుతున్నాయి. 

దేశంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) కోసం ఆత్రంగా ఎదురుచూసే ఫుట్ బాల్ అభిమానులకు ఇది గొప్ప వార్తే కానీ ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించడమంటే ఉప్పు లేకుండా కూర, తీపి లేకుండా పాయసం చేసుకొన్నట్లే అని చెప్పవచ్చు. కానీ నానాటికీ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు ఒకేసారి స్టేడియంలోకి వేల సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తే అణు విస్పోటనం జరిగినట్లు ఒకేసారి అందరికీ కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ నిర్ణయం ఫుట్ బాల్ అభిమానులకు చాలా నిరాశ కలిగిస్తున్నా కనీసం టీవీల ముందు కూర్చొని ఆటను చూసే అవకాశం లభిస్తుందని సరిపెట్టుకోక తప్పదు.

Related Post