కరోనా దెబ్బకు ఐ‌పిఎల్ వాయిదా!

March 14, 2020
img

కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అవుతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈనెల 29 నుంచి ప్రారంభం కావలసిన ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా కేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మ్యాచులు నిర్వహించినట్లయితే లక్షలాదిమంది ప్రజలు ఒక్కచోటకు చేరుతారు కనుక కరోనా వైరస్ సులువుగా వ్యాపించవచ్చుననే భయంతో హర్యానా, డిల్లీ, ముంబై, కర్ణాటక ప్రభుత్వాలు మ్యాచ్ నిర్వహణకు అనుమతి నిరాకరించాయి. కానీ ఈ దశలో ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా వేస్తే వేలకోట్లు నష్టం వాటిల్లుతుంది కనుక ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాలలోనైనా మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ విదేశాలలో చేసిన ఆ ప్రయోగం విఫలం అయినట్లు తెలుసుకొని ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

ఇవే కారణాలతో భారత్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ధర్మశాలలో జరుగవలసిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. కనుక ఆదివారం లక్నోలో జరుగవలసిన రెండవ మ్యాచ్ కోసం ఇరు దేశాల ఆటగాళ్లు అక్కడకు చేరుకొన్నారు. నేటి నుంచి ప్రాక్టీస్ సెషన్స్ కు సిద్దమవుతుండగా ఈ మ్యాచులను కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో దక్షిణాఫ్రికా టీం స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యింది. మ్యాచులు రద్దు కావడంతో క్రికెట్ అభిమానులు, ఆటగాళ్ళు కూడా తీవ్ర నిరాశ చెందారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో లక్షలమంది సమక్షంలో మ్యాచులు నిర్వహించడం ప్రమాదకరం కనుక ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పారు.

Related Post