హెలికాఫ్టర్‌ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబి బ్రెయింట్ మృతి

January 28, 2020
img

ప్రపంచ ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబి బ్రెయింట్ (41) ఆదివారం ఉదయం ఓ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. ఆయనతోపాటు బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా మంచిపేరు తెచ్చుకొంటున్న ఆయన కుమార్తె జియానా (13), బేస్ బాల్ కోచ్ జాన్ ఆల్టోబెల్లీ (56), ఆయన భార్య కేరీ, వారి కుమార్తె అలీస్సామ హెలికాఫ్టర్‌ పైలట్‌తో సహా మొత్తం 9 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. 

అమెరికా కాలమాన ప్రకారం అమెరికాలోని లాస్ ఏంజలీస్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు వారి హెలికాఫ్టర్‌ బయలుదేరింది. కానీ కొద్దిసేపటికే క్యాలాబసస్ అనే కొండప్రాంతంలో కూలిపోయింది. ఆ సమయంలో మంచు చాలా విపరీతంగా కురుస్తుండటంతో వారు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ కొండను డ్డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

కాలిఫోర్నియాలో జియానా పాల్గొంటున్న బాస్కెట్‌బాల్ పోటీని చూసేందుకే వారందరూ హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. కానీ దురదృష్టం కొద్దీ ఈ ప్రమాదంలో అందరూ దుర్మరణం పాలయ్యారు. 

అమెరికాతో సహా ప్రపంచదేశాలలో ఆయన అభిమానులు, క్రీడాకారులు ఈ దుర్వార్త విని షాక్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖులు, సంస్థలు, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు, మంత్రి కేటీఆర్‌, భారత్‌ క్రీడాకారులు, ఆయన అభిమానులు కోబి బ్రెయింట్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

 పెద్దగా చదువుకొని కోబి బ్రెయింట్ ప్రపంచంలో తిరుగులేని బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడిగా పేరు సంపాదించుకొన్నాడు. అమెరికాలో నేషనల్ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్ ( ఎన్‌బీఎ) పోటీలలో కోబి బ్రెయింట్ ఆటను ఆస్వాదించడానికి దేశాధినేతలు తరలివచ్చేవారంటే ఆయన ఆట తీరు ఎంత గొప్పగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 2008,2012లో జరిగిన ఒలింపిక్ పోటీలలో కోబీ అమెరికాను గెలిపించాడు. కోబి బ్రెయింట్ ఎప్పుడూ 8 లేదా 24 నెంబరుగల జెర్సీలను ధరించి పోటీలలో పాల్గొనేవారు. 1996 నుంచి 2016 వరకు రెండు దశాబ్ధాల పాటు అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలను తన ఆటతో అలరించిన కోబి బ్రెయింట్ 2016లో ఆడటం మానేశాడు.  అప్పటి నుంచి అమెరికాలోని ఔత్సాహిక బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులకు, తన కుమార్తె జియానాకు శిక్షణ ఇస్తున్నారు. 


అంత గొప్ప ఆటగాడు హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారనే  వార్తను అమెరికన్లు జీర్ణించుకోలేకపోయారు. అమెరికాలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో వివిద సంస్థలు, ప్రజలు, ప్రముఖులు ఆయన జెర్సీలను, ఫోటోలను పెట్టి కన్నీళ్లతో శ్రద్దాంజలి ఘటించారు.


Related Post