ఐపిఎల్ మ్యాచ్‌కు ఎంపికైన హైదరాబాద్‌ కుర్రాడు

December 20, 2019
img

వచ్చే ఏడాది జరుగబోయే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ కుర్రాడు బి సందీప్ ఎంపికయ్యాడు. గురువారం కోల్‌కతాలో ఐపిఎల్-2020 సీజన్‌కు జరిగిన క్రికెటర్ల వేలంపాటలో సన్ రైజర్స్ హైదరాబాద్‌, సందీప్‌ను బేస్ ప్రైస్ రూ.20 లక్షలకు సొంతం చేసుకొంది. దాంతో ఈసారి మన హైదరాబాద్‌ కుర్రాడు సందీప్ ఐపిఎల్ మ్యాచ్‌లలో ఆడటం ఖాయం అయ్యింది.సందీప్ తల్లితండ్రులు పరమేశ్వర్, ఉమారాణి. నగరంలోని రాంనగర్ వద్ద వైఎస్సార్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సమీపంలో వారు నివాసం ఉంటున్నారు. సందీప్ తండ్రి పరమేశ్వర్ బీడీఎల్ సంస్థలో పనిచేస్తూ క్రికెట్ మ్యాచ్‌లలో ఎంపైరింగ్ కూడా చేస్తుండేవారు. క్రికెట్‌పై అభిమానంతో తన కుమారుడు సందీప్‌కు మూడేళ్ళ వయసు నుంచే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అతను కొంచెం పెరిగి పెద్దవాడైన తరువాత పరమేశ్వర్ స్వచ్ఛందంగా పదవీ విరామణ చేసి పూర్తికాలం కుమారుడి క్రికెట్ శిక్షణకే అంకితమైపోయారు. ఆయన పట్టుదల, సందీప్ ప్రతిభతో 18 ఏళ్ళ వయసులోనే రంజీ మ్యాచ్‌లలో స్థానం సంపాదించుకొన్నాడు. అప్పటి నుంచి క్రికెట్‌లో చక్కగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి ఏడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు చేశాడు. సందీప్ సగటు స్కోరు 48.5 రన్స్. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయిన సందీప్ విజయ్ హజారే 50 ఓవర్ల మ్యాచ్‌లో హైదరాబాద్‌ టీం తరపున ఆడి ఏకంగా 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం సందీప్ హైదరాబాద్‌ రంజీ జట్టుకు సందీప్ వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు.  

ఐపిఎల్ మ్యాచ్‌కు సందీప్ ఎంపికైనట్లు తెలియడంతో అతను, తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషంతో పొంగిపోయారు. ఇన్నేళ్ళ తమ కష్టానికి గుర్తింపు లభించిందని పరమేశ్వర్ అన్నారు. సందీప్ ఐపిఎల్‌కు ఎంపికైనట్లు తెలియడంతో హైదరాబాద్‌ రంజీ ప్లేయర్లు, రాంనగర్‌లో నివాసముంటున్నవారు, సందీప్ స్నేహితులు వారి ఇంటికి చేరుకొని అభినందనలు తెలియజేస్తున్నారు. 

ఐపిఎల్ 20-20 మ్యాచ్‌లు వచ్చే ఏడాది మార్చి 23నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాటిలో మొత్తం 8 టీంలు  పాల్గొంటాయి. ప్రతీ టీం 13 మ్యాచ్‌లు ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 8 గంటల నుంచే మొదలవుతాయి.

Related Post