అవమానం జరిగిన చోటే సన్మానం

September 13, 2019
img

డిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం పేరును దివంగత కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చబడింది. అరుణ్ జైట్లీ 1999 నుంచి 2012 వరకు 13 ఏళ్ళ పాటు డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సేవలందించారు. డిల్లీలో క్రికెట్ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కోట్ల స్టేడియానికి ఆయన పేరు పెడుతునట్లు డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రజత్ శర్మ చెప్పారు. గురువారం కోట్లా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా, విరాట్ కోహ్లీ దంపతులు, టీమ్ కోచ్ రవిశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. స్టేడియం పేరు మార్చినప్పటికీ మైదానంకు కోట్లా మైదానంగానే పరిగణిస్తామని రజత్ శర్మ తెలిపారు. 

విశేషమేమిటంటే, అరుణ్ జైట్లీకి ఎక్కడైతే అవమానం ఎదుర్కోవలసి వచ్చిందో అదే చోట అపూర్వమైన ఈ గౌరవం లభించింది. ఆయన డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడ్డారని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదేపదే ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆ ఆరోపణలను నిజమని నిరూపించాలని లేకుంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. కానీ జైట్లీ మాటలను పట్టించుకోకుండా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు కొనసాగించడంతో అరుణ్ జైట్లీ ఆయనపై డిల్లీ హైకోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. కానీ ఆ కేసులో జైట్లీ అవినీతికి పాల్పడినట్లు కేజ్రీవాల్ నిరూపించలేకపోవడంతో లిఖితపూర్వకంగా బేషరతు క్షమాపణలు చెప్పుకొని ఆ కేసు నుంచి బయటపడ్డారు. 

కేజ్రీవాల్ ఆరోపణల కారణంగా అరుణ్ జైట్లీ ప్రతిష్టకు భంగం కలిగినప్పటికీ, ఈ తదనంతర పరిణామాలతో జైట్లీ ప్రతిష్ట మరింత పెరిగింది. ఇప్పుడు అదే క్రికెట్ స్టేడియంకు జైట్లీ పేరు పెట్టడంతో ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Related Post