మేము అంత గొప్పవాళ్ళం కాము: బంగ్లా కెప్టెన్ మోర్తాజా

July 17, 2019
img

సాధారణంగా డబ్బు, పలుకుబడి, అధికారం, పేరు ప్రతిష్టలు వచ్చేసరికి మనుషులలో అహంభావం బయటపడుతుంటుంది. కానీ మైదానంలో చాలా దూకుడుగా వ్యవహరించే బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్ మష్రఫ్ మోర్తాజా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినవి వింటే ఆయనను మెచ్చుకోకుండా ఉండలేము. తమను దేశప్రజలు చాలా గొప్పవారిగా భావిస్తుంటారని కానీ వారు ఊహించుకున్నంత గొప్పవారంకామని, తమ కంటే అన్నదాతలు, కార్మికులు, జవాన్లు, వైద్యులు ఎంతో గొప్పవారని మోర్తాజా అన్నారు. వారు చేసే ఏ ఒక్కపనీ తాము చేయలేమని కానీ దేశప్రజలు వారిని పట్టించుకోకుండా తమను ఆరాధించడం సరికాదని మోర్తాజా అన్నారు. 

సినీ నటులు, గాయకుల మాదిరిగా తాము కూడా ప్రజలను రంజింపజేయడం తప్ప మరేమీ చేయలేమని అన్నారు. తాము డబ్బులు తీసుకొని ఆట ఆడుతున్నామని, కానీ ఆ ఆటలో తాము కనబరిచిన నేర్పు వలన ప్రజలు తమను గొప్పవారిగా భావించి ఆరాధించడం సరికాదన్నారు. క్రికెట్ ఆటగాళ్ళపై చూపే ఈ ఇష్టం, అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు సాటి దేశప్రజల పట్ల, తమ కోసం శ్రమిస్తున్న రైతులు, జవాన్లు, శ్రామికుల పట్ల చూపాలని మోర్తాజా ప్రజలను కోరారు. ప్రజలందరూ సక్రమంగా తమ విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తూ తమ వలన దేశానికి ఎంతోకొంత మేలుకలిగేలా క్రమశిక్షణతో జీవించాలని మోర్తాజా కోరారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఖర్చు చేసే సమయంలో తమ కుటుంబాలకు, దేశానికి ఏమైనా మేలు చేకూర్చేపనులు చేస్తే బాగుంటుందని మోర్తాజా అన్నారు. 

క్రికెట్ అనేది మిగిలిన క్రీడల మాదిరిగానే ఒక క్రీడ మాత్రమేనని దానికీ దేశభక్తికీ ఎటువంటి సంబందమూ లేదని మోర్తాజా అన్నారు. అయితే క్రికెట్‌ ఆటకు దేశభక్తిని జోడించిన ఘనత రకీబుల్ హాసన్ వంటివారికి దక్కుతుందన్నారు. 1971లో బాంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటసమయంలో జరిగిన ఒక మ్యాచ్‌లో పాల్గొన్న రకీబుల్ హాసన్ తన బ్యాట్‌పై ‘మా దేశానికి స్వేచ్చా..స్వాతంత్రం కల్పించాలి’ అనే సందేశంతో యావత్ ప్రపంచానికి బాంగ్లా ప్రజల మనోభావాలను తెలియజేయగలిగారన్నారు. కానీ ఇప్పుడు క్రికెట్ కేవలం ఒక ఆటగా మాత్రమే ఆడుతున్నాము కనుక మ్యాచ్ గెలిస్తే దేశం గెలిచినట్లు సంతోషంతో చిందులువేయడం, మ్యాచ్ ఒడితే దేశం ఓడిపోయినట్లు బాధపడటం సరికాదన్నారు. 

ప్రజలందరూ తమను ఆరాదించాలని, నలుగురి నోట తమ గొప్పదనం వినబడాలని తపించిపోయే ప్రముఖులను చూసి ఉంటాము కానీ ఈవిధంగా తమ కంటే రైతులు, సైనికులు, శ్రామికులే గొప్పవారని వారినే గౌరవించడం నేర్చుకోవాలని ఈరోజుల్లో చెప్పేవారెవరున్నారు?

Related Post