జి.వివేక్..ఇక దిగిపో: హైకోర్టు

June 12, 2018
img

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపి జి.వివేక్ కు హైకోర్టు ఈరోజు ఊహించని షాక్ ఇచ్చింది. అయన తక్షణం ఆ పదవిలో నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. అయన ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదాను అనుభవిస్తూ, మరోపక్క హెచ్.సి.ఏ. అధ్యక్ష పదవి చేపట్టడం నిబందనలకు విరుద్దమని అంబుడ్స్ మెన్ జస్టిస్ ఎల్.నర్సిసింహారెడ్డి మార్చిలో తీర్పు చెప్పారు. దానిని జి.వివేక్ హైకోర్టులో సవాలు చేసినప్పుడు సింగిల్ జడ్జి స్టే మంజూరు చేశారు. దానిపై మళ్ళీ దాఖలైన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం అంబుడ్స్ మెన్ తీర్పును సమర్ధించింది. ఈ వ్యవహారంపై హెచ్.సి.ఏ. మరోసారి సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అప్పటి వరకు జి. వివేక్ పదవిలో కొనసాగడానికి వీలులేదని స్పష్టం చేసింది.               

హైకోర్టు తీర్పును మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్వాగతించారు. ఎట్టకేలకు తమ పోరాటం ఫలించి హెచ్.సి.ఏ.లో నిబంధనల ప్రకారం కొత్త అధ్యక్షుడు, ప్యానల్ ను ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యిందని అన్నారు. త్వరలో హెచ్.సి.ఏ. జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. 


Related Post