అరుణా బుద్దారెడ్డి ఎవరో తెలుసా?

February 27, 2018
img

అరుణా బుద్దారెడ్డి.. బహుశః చాలా మంది ఈ పేరు విని ఉండకపోవచ్చు. లేదా న్యూస్ పేపర్లలో స్పోర్ట్స్ పేజిలో ఎప్పుడో చూసి ఉండవచ్చు. ఆ పేజిలో ఒక క్రీడాకారిణి పేరు కనబడిందంటే, దాని వెనుక ఎవరికీ కనబడని కష్టం, శ్రమ, పట్టుదల ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అరుణా బుద్దారెడ్డి కూడా కటోరశ్రమతోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదిగింది. కానీ సానియా మీర్జా, పివి సింధు, సైనా వంటి క్రీడాకారిణులకు లభించినంత గుర్తింపు, ఆదరణ ఆమెకు లభించలేదు. అందుకే ఇంత పరిచయం అవసరపడుతోంది.       

అరుణా బుద్దారెడ్డి మన హైదరాబాద్ కు చెందిన యువతి. మెల్ బోర్న్ లో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ లో భారత్ కు రజత పతకం సాధించింది. 

ఆమెకు ఏడేళ్ళ వయసున్నప్పుడే ఆమె తండ్రి హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియానికి తీసుకువెళ్ళి జిమ్నాస్టిక్స్ కోచ్ గిరిరాజ్ కు అప్పజెప్పారు. అరుణా బుద్దారెడ్డి సహజసిద్దంగా ఆ క్రీడకు అన్నివిధాలుగా తగినధిని గుర్తించిన గిరిరాజ్ ఆమెను బాగా సానపట్టి ఆ క్రీడలో నిష్ణాతురాలిని చేశారు. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో అరుణా బుద్దారెడ్డి తండ్రి నారాయణ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. కానీ ఆమె గుండె దిటవు చేసుకొని కుటుంబ సభ్యులు, కోచ్ లు సహకారం, ప్రోత్సాహంతో తన శిక్షణ కొనసాగిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పతకాలు సాధిస్తూనే ఉంది. జాతీయ స్థాయి పోటీలలో ఆమె మూడు పతకాలు సాధించింది. 

“ఆమె చాలా ప్రతిభ కలిగిన జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె భవిష్యత్ లో తప్పకుండా 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించి దేశానికి గొప్ప పేరు తెస్తుందనే నమ్ముతున్నాను,” అని అన్నారు తెలంగాణా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మహేష్. 

అరుణా బుద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “ఈ క్రీడలో ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, 25 ఏళ్ళు వయసు వచ్చేలోగానే ఏదైనా సాధించాల్సి ఉంటుంది. ఆ తరువాత శరీరంలో ‘ఫ్లెక్సిబిలిటీ’ తగ్గిపోతుంది కనుక ఎంతటివారైనా రిటైర్ మెంట్ కాక తప్పదు. కనుక నేను కూడా ఆ లోగానే ఏమైనా సాధించాలి. అందుకోసం రోజూ కటోరంగా శ్రమించక తప్పదు. ఈ రంగం నుంచి తప్పుకొన్నాక నేను కూడా మా నాన్నగారిలాగే ఛార్టెడ్ అకౌంటంట్ గా స్థిరపడాలనుకొంటున్నాను,”అని అన్నారు. 


Related Post