పాముకు పాలు పోసి పెంచితే...

December 01, 2017
img

విష సర్పానికి ప్రేమగా పాలు పోసి పెంచినా అది ఏదో ఒకరోజు కాటేయక మానదు. ఉగ్రవాదులు కూడా అంతేనని పాకిస్తాన్ అనుభవపూర్వకంగా చాలాసార్లే తెలుసుకొంది. పాక్ పెంచి పోషించిన తాలిబాన్ ఉగ్రవాదులు మళ్ళీ ఇవ్వాళ్ళ అదే మరోమారు నిరూపించి చూపారు. 

ఈరోజు ఉదయం కొందరు ఉగ్రవాదులు పెషావర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి తమ వద్ద ఉన్న మారణాయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో 12 మంది అక్కడికక్కడే చనిపోగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు బురఖాలు ధరించి సైకిల్ రిక్షాలలో కూర్చొని లోపలకు రావడంతో ఎవరికీ వారిపై అనుమానం రాలేదు. లోపలకు ప్రవేశిస్తూనే వారు అందరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ బాంబులు విసురుతూ విద్వంసం సృష్టించారు. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకొన్న పాక్ భద్రతాదళాలు వెంటనే అక్కడకు చేరుకొని, యూనివర్సిటీని చుట్టుముట్టి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. తాజా సమాచారం ప్రకారం ఇంకా ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మద్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.           

పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐ తమనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నందునే తాము ఈ దాడులకు పాల్పడ్డామని తాలిబాన్ ఉగ్రవాద సంస్థ అధికార ప్రతినిధి మహమ్మద్ కొరసాని ప్రకటించాడు. సరిగ్గా మూడేళ్ళ క్రితం డిసెంబర్ నెలలోనే తాలిబాన్ ఉగ్రవాదులు పెషావర్ లో పాక్ ఆర్మీ స్కూల్లోకి ప్రవేశించి 134 మంది విద్యార్ధులను అతికిరాతకంగా కాల్చి చంపారు. ఇక ఉగ్రవాదులను ఉపేక్షించబోమని చెప్పిన పాక్ సర్కార్ అప్పుడు కొన్ని రోజులు హడావుడి చేసి ఊరుకొంది. బహుశః మళ్ళీ ఇప్పుడూ అలాగే చేసి చేతులు దులుపుకొంటుందేమో? 

Related Post