ఉత్తర కొరియాతో మళ్ళీ టెన్షన్ షురూ

November 29, 2017
img

ఉత్తర కొరియా మళ్ళీ ఈరోజు ఉదయం క్షిపణి ప్రయోగం చేసింది. ఈసారి ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసింది. దానితో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో సహా యూరోప్ లోని ఏ దేశంపైనైనా దాడి చేయవచ్చని ఉత్తర కొరియా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తమ దేశాన్ని ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశంగా అమెరికా ప్రకటించి ఆంక్షలు విధించినందుకే ఈ క్షిపణి ప్రయోగం చేశామని ప్రకటనలో తెలియజేసింది. 

ఉత్తర కొరియా ఈరోజు ప్రయోగించిన ఖండాంతర క్షిపణి సుమారు 1,000 కిమీ దూరం ప్రయాణించి జపాన్ సముద్రజలాలో పడింది. ఈ క్షిపణి ప్రయోగాన్ని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్యసమితిలో భద్రతాసమితి ఈరోజు అత్యవసరంగా సమావేశం కాబోతోంది. 

ఉత్తర కొరియాకు తగిన గుణపాఠం నేర్పించవలసిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ భద్రతకు ఉత్తర కొరియా భంగం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోలేమని అన్నారు.

"నేను ఒకటే చెప్పదలచుకొన్నాను. ఈ వ్యవహారాన్ని మేము చూసుకొంటాము. ఈ పరిస్థితులను మేమే చక్కదిద్దగలము," అని డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. 

ఉత్తర కొరియా చేసిన ఈ దుస్సాహసం అమెరికాను మళ్ళీ కవ్వించినట్లయింది. కనుక ఈసారి ట్రంప్ హెచ్చరికలకే పరిమితం అవుతారో లేక ఉత్తర కొరియాపై దాడికి సిద్దం అవుతారో చూడాలి. ఒకసారి యుద్ధం ఆరంభం అయితే వినాశనానికి దారితీసే దానిని ఇక ఎవరూ ఆపలేరని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Related Post