ఇవంకా ట్రంప్..మన ప్రధాని కన్న గొప్పదా?

November 23, 2017
img

అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంకా ట్రంప్ ఈ నెల 28-30 వరకు హైదరాబాద్ లో జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతున్నందున, అమెరికాకు చెందిన గూడఛారులు, భద్రతా సిబ్బంది హైదరాబాద్ చేరుకొని భద్రతా ఏర్పాట్లను చేసుకొంటున్నారు. దాని కోసం అమెరికాకు చెందిన నిఘా ఉపగ్రహాన్ని హైదరాబాద్ వైపు తిప్పి, ఆమె బసచేయబోయే వెస్టిన్ హోటల్, సదస్సు జరుగబోయే హెచ్.ఐ.సి.సి., ఫలక్ నూమా ప్యాలెస్, తదితర ప్రాంతాలపై నిఘా పెట్టబోతున్నారు. ఆమె కోసం అమెరికా నుంచే నాలుగు ప్రత్యేకమైన కార్లను రప్పించారు. వాటినే ఆమె ఉపయోగిస్తారు. భారత్ కు చెందిన హై సెక్యూరిటీ ఎన్.ఎస్.జి.వాహనాలను ఆమె ఎస్కార్ట్ వాహనాలుగా ఉపయోంచబోతున్నారు. 

ఆమె భద్రత దృష్ట్యా ఆమె బస చేస్తున్న ప్రాంతం, హైదరాబాద్ లో ఆమె పర్యటించబోయే ప్రాంతాలన్నీ అమెరికా గూడఛారులు, భద్రత సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా ప్రాంతాలలో అమెరికా-ఎన్.ఎస్.జి. బృందాలతో కూడిన మూడంచెల భద్రతావ్యవస్తలను ఏర్పాటుచేస్తున్నారు. వాటిలో చిట్టచివరిదైన మూడవ అంచె భ్రదతా వ్యవస్థలో హైదరాబాద్ పోలీసులు ఉంటారు. 

ఇక ఇవంకా పర్యటన సందర్భంగా ఖానామెట్, ఇజ్జత్ నగర్ పరిసర ప్రాంతాలలో పాన్ డబ్బాలు, కిరాణా దుఖాణాలు, ఇతర చిన్న పెద్ద దుఖాణాలను మూడు రోజులపాటు మూసి వేయిస్తున్నారు. ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలందరి కదలికలపై కూడా ఆంక్షలు విదించారు. ఇంటిలో నుంచి బయటకు వెళ్ళాలన్నా, తిరిగి రావాలన్నా అందరూ తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. 

హైటెక్స్ కమాన్ నుంచి న్యాక్ గెట్ వరకు, సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ జంక్షన్ వరకు, అక్కడి నుంచి గచ్చిబౌలి ఓటర్ జంక్షన్ వరకు గల హోటల్స్, పాన్ డబ్బాలు, మొబైల్, కిరాణా దుఖానాలు అన్నిటినీ పూర్తిగా మూయించివేస్తున్నారు. 

ఇవంకా ట్రంప్ భద్రత కోసం అమెరికా అధికారులు చేస్తున్న హడావుడి చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి అన్నట్లున్నాయి. ఆమెకు భద్రత కల్పించడం భారత్ వల్ల కాదనట్లుంది. అయితే అమెరికాకు ఇటువంటి అతిగా ప్రవర్తించడం...ఈవిధంగా ఆర్భాటం చేయడం అలవాటే. ఇవంకాను ఆహ్వానించినందుకు వారి 'అతి'ని హైదరాబాద్ వాసులు భరించకతప్పదు. 

Related Post