హెచ్-1 బి వీసా బిల్లు సవరణకు కమిటీ ఆమోదం

November 16, 2017
img

అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకోవాలని కలలుకంటున్న భారతీయులకు నిరాశ కలిగించే వార్త ఇది. అమెరికాలో ఉద్యోగాల కోసం జారీ చేస్తున్న హెచ్-1 బి వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన కటినమైన ఆంక్షల గురించి అందరికీ తెలుసు. వాటిని అధ్యయనం చేయడానికి ‘ది హౌస్ జ్యూడిష్యరీ కమిటీ’ (అంటే యుఎస్ కాంగ్రెస్ (పార్లమెంట్) స్టాండింగ్ కమిటీ) ఏర్పాటు చేయబడింది. 

ఈ ది హౌస్ జ్యూడిష్యరీ కమిటీ చైర్మన్ బాబ్ గుడ్ లాట్ అధ్యక్షతన బుధవారం వాషింగ్టన్ డి.సి.లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో “ది ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ (హెచ్.ఆర్.170)” కు ట్రంప్ సర్కార్ సూచించిన సవరణలపై చర్చించి యధాతధంగా ఆమోదించింది. సబ్ కమిటీ చైర్మన్ ఇస్సా మరియు కమిటీలో ఇతర సభ్యులు  పాల్గొన్న ఈ సమావేశంలో..సుమారు 20 ఏళ్ళ క్రితం అప్పటి అవసరాలు, పరిస్థితులు వగైరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ చట్టంలో హెచ్-1 బి వీసాల జారీ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, కనుక వాటిని నేటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా సవరించి అమెరికా పౌరులకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు అంగీకరించారు. సబ్ కమిటీ చైర్మన్ ఇస్సా మాట్లాడుతూ, “ఈ హెచ్-1 బి వీసాల ద్వారా అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన విదేశీయులు అమెరికాకు వచ్చి విశేషసేవలు అందిస్తున్నారు. వారు దేశ ఆర్ధికవ్యవస్థకు అధనపు విలువను జోడిస్తున్నారు. అయితే, ఈ హెచ్-1 బి వీసాలను అనేక సంస్థలు దుర్వినియోగం చేస్తుండటం వలన అమెరికన్లకు ఉద్యోగాల విషయంలో తీరని అన్యాయం జరుగుతోంది. కనుక ఉద్యోగాల కల్పనలో అమెరికన్లకు అన్యాయం జరుగకుండా ఉండేందుకు, వారికి ప్రాధాన్యత కల్పించేందుకు ‘ది ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ (హెచ్.ఆర్.170)’ కు చేసిన సవరణలు అవసరమని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 

ది హౌస్ జ్యూడిష్యరీ కమిటీ చైర్మన్ తో సహా సభ్యులు అందరూ ఆ సవరణలకు మూజువాణి పద్ధతిలో ఆమోదం తెలిపారు. కనుక ఇక దీనిని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమేనని భావించవచ్చు.          


Related Post