చర్చిలో సైతాను..27 మంది బలి

November 06, 2017
img

అనాదిగా రాజ్యకాంక్షతో జరిగే యుద్ధాలలో సైనికుల మద్య ఎటువంటి శత్రుత్వంలేకపోయినా ఒకరినొకరు చంపుకొంటూనే ఉన్నారు. అదేవిధంగా జాతుల మద్య జరిగే ఘర్షణలలో వేలాదిమంది అమాయకులు మరనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా  గత మూడు నాలుగు దశాబ్దాలుగా తీవ్రవాదుల దాడులలో వేలాదిమంది పౌరులు మరణిస్తూనే ఉన్నారు. వారు మతం పేరుతో చేస్తున్న మారణఖాండలో చివరికి స్కూల్లో చదువుకొంటున్న చిన్నారులను, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనామందిరాలలో దైవప్రార్ధనలు చేసుకొంటున్న భక్తులను కూడా విడిచిపెట్టకుండా అతికిరాతకంగా చంపుతుండటం మనసులను కలిచివేస్తుంది. 

అమెరికాలోని టెక్సాస్ లో ఒక చర్చిలో ఆదివారం ఇటువంటి ఘాతుకమే జరిగింది. సుదర్లాండ్ స్ప్రింగ్స్ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రార్ధనలు జరుగుతుండగా ఒక వ్యక్తి లోపలకు ప్రవేశించి, లోపలున్నవారిపై తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పులలో 27 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక స్థానికుడు ధైర్యం చేసి తన వద్ద ఉన్న తుపాకీతో ఎదురుకాల్పులు జరుపగా అతను గాయపడటంతో తన తుపాకీని అక్కడే పడేసి తన కారులో పారిపోయాడు. 

ఈ సంగతి తెలుసుకొన్న పోలీసులు ఆ వ్యక్తిని వెంబడించగా అతని కారు గౌడలూప్ కంట్రీ అనే ప్రాంతానికి చేరుకొన్నప్పుడు రోడ్డు పక్కకు వెళ్లి ఆగిపోయింది. పోలీసులు ఆ కారును చుట్టుముట్టి చూడగా లోపల ఉన్న ఆ వ్యక్తి చనిపోయున్నాడు. స్థానికుడు జరిపిన కాల్పులలో గాయపడి చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

27మంది పౌరులను అతికిరాతకంగా కాల్చి చంపిన ఆ వ్యక్తి 20-22 వయసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని పూర్తి వివరాలు, అతను ఈ దారుణానికి పాల్పడటానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. ఇది ఉగ్రవాద ప్రేరేపిత దాడా లేక అమెరికన్ గన్ కల్చర్ దుష్ప్రభావమా అనే విషయం తెలియవలసి ఉంది. ఏమైనప్పటికీ, చర్చిలో ప్రార్ధనలు చేసుకొంటున్న వారిపై కాల్పులు జరుపడం మానవత్వానికే మచ్చ.  

Related Post