అణ్వాయుధాలతో భారత్ పై దాడికి మేము రెడీ!

September 22, 2017
img

ఒక దేశానికి ప్రధాన మంత్రి అంటే ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడాలి. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ పాక్ ప్రధాని షహీద్‌ ఖకాన్‌ అబ్బాసీ కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ లాగే చాలా వెర్రిగా మాట్లాడారు.

ఆయన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధిసభ సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వచ్చినప్పుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, “భారత్ యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా మేము కూడా బలమైన వ్యూహం సిద్దం చేసుకొన్నాము. ఒకవేళ భారత్ యుద్ధానికి బయలుదేరితే, అది ఒకే పెద్ద సైన్యంగా బయలుదేరకుండా ‘కోల్డ్ స్టార్ట్’ పద్దతిలో చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మాదేశంపై దాడి చేయాలనుకొంటోంది. కనుక వాటిని ఎదుర్కోవడానికి మేము తక్కువ రేంజ్ కలిగిన అణ్వాయుధాలను సిద్దం చేసుకొన్నాము. భారత్ అటువంటి దుస్సాహసానికి పూనుకొన్నట్లయితే మేము వారిపై అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకాడబోము,” అని చెప్పారు.

ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుకోనేవిధంగా మాట్లాడాలి. అందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదే విజ్ఞత అంటే. ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది కాబూల్ నుంచి భారత్ తిరిగివస్తూ ఎవరూ ఊహించని విధంగా మద్యలో పాకిస్తాన్ లో దిగి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మాట్లడివచ్చారు. ఆ చిన్న చర్యతో భారత్-పాక్ సంబంధాలు ఎంత వేగంగా బలపడ్డాయో అందరూ చూశారు. కానీ యధాప్రకారం పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శించుకొని జమ్మూ కాశ్మీర్ లో చిచ్చుపెట్టడంతో మళ్ళీ ఇరు దేశాల మద్య దూరం పెరిగింది. 

కనుక ఇప్పుడు పాక్ ప్రధానిగా వ్యవహరిస్తున్న షహీద్‌ ఖకాన్‌ అబ్బాసీ భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు ఈ సమావేశాలను ఒక చక్కటి వేదికగా ఉపయోగించుకోవచ్చు. కానీ తమ వక్రబుద్ధి ఎన్నటికీ మారదని నిరూపిస్తూ ‘భారత్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని’ చెప్పి ఆ దూరాన్ని ఇంకా పెంచుకొన్నారు. మన సైనికులు పాక్ భూభాగంలో ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి వచ్చినప్పుడే పాక్ దానిని అడ్డుకోలేకపోయింది. ఆ కారణంగానే యావత్ ప్రపంచమంతా గుర్తించిన ఆ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లు పాక్ అంగీకరించలేదు. అటువంటి దయనీయస్థితిలో ఉన్న పాక్ భారత్ పై అణ్వాయుధాలతో దాడులు చేస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదం.

Related Post