మెక్సికోలో బారీ భూకంపం

September 20, 2017
img

అమెరికా పొరుగు దేశమైన మెక్సికోలో మంగళవారం పెను భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు పై 7.4 తీవ్రత నమోదైన ఆ భూకంపం ధాటికి  మెక్సికో నగరంతో సహా ప్యూబ్లా, మొర్లస్ తదితర ప్రాంతాలలో వందలాది ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల భారీ భవనాలు పేకమేడల్లా కుప్ప కూలాయి. ఆ శిధిలాల క్రింద అనేకమంది ప్రజలు చిక్కుకు పోయారు. సుమారు 153 మంది మరణించగా అనేక వందల మంది గాయపడ్డారు. భూకంపం సంభవించబోతోందని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసిన గంటలోపే ఈ పెను భూకంపం సంభవించడం విశేషం. ప్రజలందరూ భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. వారి కళ్ళ ఎదుటే భవనాలు పేకమేడల్లా కూలిపోతుండటంతో భయబ్రాంతులయ్యారు. 

ఈ భూకంపం కేంద్రం ప్యూబ్లాకు తూర్పు వైపున ఉన్నట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. విచిత్రమైన విషయం ఏమిటంటే 1985లో సరిగ్గా ఇదేరోజున అంటే సెప్టెంబర్ 19న మెక్సికోలో పెను భూకంపం వచ్చింది. అప్పుడు సుమారు 10,000 మందికి పైగా చనిపోయారు. నిన్న వచ్చిన భూకంపంలోను శిధిలాల క్రింద అనేకమంది చిక్కుకుపోయారు కనుక ఇప్పుడూ అదే స్థాయిలో ప్రాణనష్టం జరిగిఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

పోలీసులు, వైద్య సహాయ సిబ్బంది రంగంలో దిగి గాయపడిన వారిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్య శిభిరాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మరో పక్క శిధిలాల తొలగింపు కార్యక్రమం కూడా మొదలైంది. నిన్నటి వరకు కళకళలాడిన మెక్సికో నగరం నేడు ఎక్కడ చూసినా శిధిలాలతో, భాధితులతో ఆక్రంధనలతో మారుమ్రోగుతోంది. మెక్సికోకు అన్ని విధాలుగా సహాయసహాకారాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. 


Related Post