ఉత్తర, దక్షిణ కొరియాలు క్షిపణి ప్రయోగాలు?

September 15, 2017
img

ఉత్తర కొరియా మళ్ళీ మరో దుస్సాహసం చేసింది. స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం 6.30 గంటలకు ఒక శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించింది. అది జపాన్ లోని హోక్కైడో ద్వీపసమూహం మీదుగా పయనించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. ఉత్తర కొరియాలోని ప్యాంగ్యాంగ్ అనే ప్రాంతం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. తమ ప్రయోగం విజయవంతం అయ్యిందని ఉత్తర కొరియా మిలటరీ ప్రతినిధి ప్రకటించారు. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి ఉత్తర జపాన్ మీదుగా సుమారు 770 కిమీ ఎత్తున 3700 దూరం ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. దాని వలన జపాన్ దేశానికి కానీ, సముద్రంలో ఉండే తమ నౌకలకు గానీ ఎటువంటి నష్టమూ జరుగలేదని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడె సుగా తెలిపారు. 

జపాన్ పై అణుబాంబులు వేసి దానిని సముద్రంలో కలిపివేస్తామని ఉత్తర కొరియా మీడియా హెచ్చరికలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ క్షిపణి ప్రయోగం చేయడంతో జపాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ఉత్తర కొరియా చేసిన ఈ దుస్సాహసంపై దక్షిణ కొరియా వెంటనే చాలా తీవ్రంగా స్పందిస్తూ అది కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే హ్యూన్ము-2 అనే శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించింది. అది కూడా పసిఫిక్ సముద్రంలోనే పడిపోయింది. ఉత్తర కొరియాకు తమ యుద్దసన్నదతను తెలియజేయడానికే దానిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ ఈరోజు చేసిన ఈ దుస్సాహసం అమెరికా, దక్షిణ కొరియాలను యుద్ధానికి ఆహ్వానించడమే అని అర్ధం అవుతూనే ఉంది. దానికి ఈసారి దక్షిణ కొరియా ధీటుగా ప్రతిస్పందించడం చూసినట్లయితే ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ తాజా ప్రయోగాలపై అమెరికా, చైనా, రష్యా, యూరోపియన్ దేశాలు, ఐక్యరాజ్యసమితి ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. ఒకవేళ ఈసారి అమెరికా జోక్యం చేసుకొన్నట్లయితే ఉత్తర కొరియా చాలా బారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. 

Related Post