అమెరికాలో భారతీయవైద్యుడి దారుణహత్య

September 15, 2017
img

అమెరికాలో భారతీయ వైద్యుడు ఒకరు హత్య చేయబడ్డారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన డాక్టర్ అచ్యుత్ రెడ్డి (57) అమెరికాలో కాన్సాస్ లో మానసిక వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఉమర్‌ రషీద్‌ దత్ (21) అనే మతిస్థిమితం లేని యువకుడు ఆయన వద్ద వైద్యం చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. డాక్టర్ అచ్యుత్ రెడ్డి అతని నుంచి తప్పించుకొని బయటకు పరిగెత్తినప్పటికీ, వెంటపడి కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనను హత్య చేసిన తరువాత రషీద్ సమీపంలో గల విచితా కంట్రీ క్లబ్ కార్ పార్కింగ్ ఏరియాలో కూర్చొని తనలో తానే ఏదో మాట్లాడుకొంటూ ఉండగా రక్తం ఓడుతున్న అతనిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి వారు అతనిని అదుపులోకి తీసుకొన్నారు. 

ఈ దురదృష్టకర సంఘటన భారతీయ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 7.30 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు డాక్టర్ అచ్యుత్ శవాన్ని స్వాధీనం చేసుకొని అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు షాక్ అయ్యారు.  

డాక్టర్ అచ్యుత్ రెడ్డికి భార్య బీనా, లక్ష్మి, రాధ, అనే ఇద్దరు కుమార్తెలు, విష్ణు అనే ఒక కుమారుడు ఉన్నారు. డాక్టర్ అచ్యుత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ఈ ఏడాది జనవరిలోనే మిర్యాలగూడలోని సీతారాంపురం కాలనీలో నివాసం ఉంటున్న తన తల్లి తండ్రులు నాగిరెడ్డి భద్రారెడ్డి, పారిజాతలతో కొన్నిరోజులు హాయిగా గడిపివెళ్ళారు. 

 డాక్టర్ అచ్యుత్ రెడ్డి నల్లగొండలోనే ఇంటర్ వరకు చదువుకొని, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివారు. బీనాతో వివాహం జరిగిన తరువాత 1989లో అమెరికా వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ మెడికల్ సెంటర్ లో రెసిడెన్సీ చేశారు. అప్పటి నుంచి కాన్సాస్ లోనే విచితా హోలిస్టిక్ సైక్రియాట్రిక్ సర్వీసస్ అనే మానసిక వైద్యశాలను స్థాపించి వైద్యసేవలు అందిస్తూ మంచి వైద్యుడిగా పేరు సంపాదించుకొన్నారు. పూల నావలా సాగుతున్న డాక్టర్ అచ్యుత్ రెడ్డి జీవితం ఎవరూ ఊహించని విధంగా ఒక పిచ్చోడి కారణంగా అస్తవ్యస్తం అయిపోయింది. డాక్టర్ అచ్యుత్ రెడ్డి తల్లి తండ్రులు, భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి శోకాన్ని మానవ మాత్రులు ఎవరూ తీర్చలేరు...కాలమే తీర్చాలి.   

Related Post