ఇర్మా..ఇదేమి కర్మ...

September 11, 2017
img

ఇర్మా తుఫాను అగ్రరాజ్యమైన అమెరికాకు వణుకుపుట్టిస్తోంది. భారతీయ కాలమానప్రకారం ఆదివారం సాయంత్రం ఇర్మా తుఫాను ఫ్లోరిడాను బలంగా తాకింది. ఆ ప్రభావానికి గంటకు 209కిమీ వేగంతో వీస్తున్న గాలుల ధాటికి పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయి. ఇళ్ళ పైకప్పులు కాగితం ముక్కల్లాగా గాలిలో ఎగిరిపోయాయి. సముద్రపు అలలు దాదాపు 15 అడుగుల ఎత్తువరకు ఎగసి పడుతున్నాయి. 

ఇర్మా తుఫాను ప్రధానంగా ఫ్లోరిడా తూర్పు తీరంలోని టాంప నగరం, నేపుల్స్, సెయింట్‌ పీటర్స్‌ బర్గ్, బ్రాడెంటన్, క్లియర్‌ వాటర్, పోర్ట్‌ మేయర్స్, సర్సోటా తదితర పట్టణాలపై విరుచుకు పడి పెను విద్వంసం సృష్టించింది. వాటిలో హిల్స్‌ బరో, బే, చార్లొటే, కొలియర్, డిక్సీ, ఫ్రాంక్లిన్, గల్ఫ్, హెర్నాండో, లెవీ, పాస్కో, టేలర్‌ కౌంటీలు ఎక్కువగా నష్టపోయాయి. మళ్ళీ వాటిలో అత్యధికంగా టాంప పట్టణం ఎక్కువగా దెబ్బతింది. ఆ ప్రాంతాలలో రోడ్లు నీట మునిగాయి. ఈ తుఫాను ఇంకా మంగళవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెపుతోంది. 

అయితే ఇర్మా తుఫాను రాకను వాతావరణ శాఖ ముందే గుర్తించి  ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినందున అది అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం జరుగకుండా కాపాడగలిగింది. ఆస్తినష్టాన్ని కొంతమేర తగ్గించగలిగింది కానీ నివారించలేకపోయింది. చాలా బారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. ముందు జాగ్రత్త చర్యగా ఫ్లోరిడా రాష్ట్రమంతటా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇర్మా భాదితులకు అవసరమైన సహాయచర్యలను అందజేసేందుకు ప్రభుత్వం వేలాదిమంది హోం ల్యాండ్ పోలీసులు, ఆర్మీ, వైద్య సహాయ సిబ్బందిని, 140 హెలికాఫ్టర్లను, 600 ఆర్మీ ట్రక్కులను సిద్దంగా ఉంచింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మేరీల్యాండ్ లోని క్యాంప్ డేవిడ్ లో బసచేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.     

ఫ్లోరిడా రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది భారతీయులున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకొనేందుకు అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అవి: 202–258–8819 (హాట్ లైన్), +14044052567, +1678179393. ఇర్మా బాధితులు తమ వివరాలను ఈ హెల్ప్ లైన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు. అలాగే అత్యవసర సహాయం అవసరమున్నవారు ఈ నెంబర్లకు సంప్రదించవచ్చని ఎంబసీ అధికారులు తెలిపారు. 

కరీబియన్ దీవులలో హెల్ప్ లైన్ నెంబర్స్: 

క్యూబా, డొమినికన్‌ రిపబ్లిక్, హైతీలో నివసిస్తున్న భారతీయుల కోసం: +5352131818

కింగ్ స్టన్ లోని భారత్ ఎంబసీలో హెల్ప్ లైన్ నెంబర్లు: 1876 833 4500, +1876 564 1378.

అరుబా: 00297–593–2552, క్యూరేసొ: 005999–513–2407, 005999– 690–2686

అత్యవసర సహాయం కోసం: 0031643743800, ఈమెయిల్: hc.kingston@mea.gov.in, hoc.kingston @mea.gov.in.


Related Post