అమెరికాను ప్రకృతి శపించిందా?

September 09, 2017
img

అమెరికా చరిత్రలోనే అతి భయంకరమైన, విద్వంసకరమైన తుఫాను ‘ఇర్మా’ ఆదివారం ఫ్లోరిడా నగరాన్ని తాకబోతోంది. ఇప్పటికే ఆ తుఫాను ధాటికి బర్బుడా, సెయింట్‌ మార్టిన్‌, యాంటిగువా, ప్యుటోరికో, వర్జిన్‌ దీవులలో భయానక విద్వంసం జరిగింది. ఇర్మా తుఫాన్ కారణంగా గంటకు 250-300 కిమీ వేగంతో గాలులు వీస్తుండటంతో దాని మార్గంలో ఉన్న ప్రతీ చెట్టు, వాహనం, భవనం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. రేపు అది ఫ్లోరిడాలో ప్రవేశించనున్నందున దక్షిణ ఫ్లోరిడా, జార్జియా, కరోలినాస్‌ ప్రాంతాలలో ‘ఎమర్జన్సీ పరిస్థితి’ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇర్మా తుఫాను ఫ్లోరిడాను తాకే సమయానికి గంటకు సుమారు 250కిమీ వేగంగా గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇర్మా తుఫాను ఎంత భీభత్సం సృష్టించిందో తెలిసింది కనుక ప్రభుత్వం వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొన్ని సురక్షిత ప్రాంతాలలో ఉన్నవారు ముందు జాగ్రత్తచర్యగా కిరాణా, కూరగాయలు, మంచినీళ్ళు, అత్యవసర మందులు వంటివి ముందే బారీగా కొనిపెట్టుకొని ఇళ్ళలో నిలువచేసుకొంటున్నారు. 

ఈ తుఫాను బాధితులను ఆదుకొనేందుకు ఐదుగురు మాజీ అమెరికా అధ్యక్షులు ముందుకు రావడం చాలా గొప్ప విషయం. మాజీ అధ్యక్షులు బారాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్, జార్జ్ డబ్ల్యూ.బుష్, జిమ్మీ కార్టర్ ‘వన్ అమెరికా అప్పీల్’ పేరిట నిధులు సమీకరణకు ముందుకు వచ్చారు. తామందరం ఈ కష్టకాలంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు, ఆయన ప్రభుత్వానికి అన్ని విధాల సహాయసహకారాలు అందించి అండగా నిలుస్తామని వారు ప్రకటించడం అభినందనీయం. ట్రంప్ కూడా వారి ప్రకటనను స్వాగతించారు.

ఇక ఇర్మా తుఫాను వెనుకే మరొక జోస్ హరికేన్ అనే మరో తుఫాను కూడా పుట్టింది. అది కూడా అమెరికా వైపు దూసుకు వస్తోంది. దాని ప్రభావంతో గంటకు 120 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

అగ్రదేశామైన అమెరికాను ప్రకృతి శపించినట్లుగా ఒకదాని వెనుక మరొకటి చొప్పున వరుసగా మూడు భారీ తుఫాన్లు, బారీ వరదలు సంభవిస్తున్నాయి. 

Related Post