ఆయనకు మళ్ళీ పరాభవం తప్పదా?

September 08, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిఏసిఏ పధకాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని 15 రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో పిటిషన్లు వేశాయి. ట్రంప్ సర్కార్ తీసుకొన్న ఈ నిర్ణయం రాజ్యంగవిరుద్ధమని, దాని వలన 8 లక్షల మంది భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని, వారి కుటుంబాలు విచ్చినం అయ్యే ప్రమాదం ఏర్పడుతుందని పిటిషన్లో పేర్కొన్నాయి. దేశప్రజలందరినీ పితృసమానమైన దృష్టితో చూడవలసిన డోనాల్డ్ ట్రంప్, అమెరికాలో చిరకాలంగా స్థిరపడిన విదేశీయులు, వారి సంతతి పట్ల ఈర్ష్యా, ద్వేషభావం ప్రదర్శిస్తూ వారిని బయటకు పంపించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారని కనుక ట్రంప్ ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిటిషన్లలో కోరాయి. 

అమెరికాలో చిరకాలంగా ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులలో చాలా మంది అక్కడే స్థిరపడటంతో వారి పిల్లలు కూడా అక్కడే పెరిగిపెద్దవారయ్యి అక్కడే ఉద్యోగాలు చేసుకొంటున్నారు. డ్రీమర్స్ గా పిలువబడే వారి హక్కులను కాపాడేందుకు కోసం గతంలో ఒబామా సర్కార్ డిఏసిఏ పధకాన్ని ఏర్పాటు చేస్తే దానిని ట్రంప్ సర్కార్ రద్దు చేయడంతో వారందరిపై అక్రమ వలసదారులుగా ముద్రవేసినట్లయింది. మాతృదేశాలతో కంటే అమెరికాతోనే అనుబందం ముడివేసుకొన్న వారిపై అటువంటి ముద్రవేయడం, స్వదేశాలకు తిరిగివెళ్ళిపొమ్మని ఆదేశించడం సహజంగానే అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అదే ఆ పిటిషన్లలో వ్యక్తం చేయబడింది. 

గతంలో ట్రంప్ సర్కార్ హెచ్1-బి వీసాలపై ఆంక్షలు విధించినప్పుడు అమెరికాలో పెద్దగా వ్యతిరేకత కనబడలేదు. అది అమెరికాకు, అమెరికన్లకు మేలు చేకూర్చే సరైన నిర్ణయమేనని ప్రజలు భావించడమే అందుకు కారణం అని చెప్పవచ్చు. కానీ ఆరు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధించినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఈ డిఏసిఏ పధకాన్ని రద్దుచేసినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముస్లిం దేశాల ప్రజలపై నిషేధం విధించినప్పుడు సుప్రీంకోర్టుతో సహా దేశంలో అనేక న్యాయస్థానాలు ఆ ఉత్తర్వులను నిలిపివేసాయి. బహుశః మళ్ళీ ఇప్పుడూ అదే జరుగవచ్చు. అదే జరిగినట్లయితే ట్రంప్ కు మరోసారి పరాభవం తప్పదు. ప్రపంచాన్నే శాశించగల అమెరికా అధ్యక్షుడుకి స్వదేశంలోనే ఎదురుదెబ్బలు తగులుతుండటం చూస్తే ఆయన పని ఇంట్లో ఈగల మోత బయట పల్లకీలలో ఊరేగింపు అన్నట్లుంది.  

Related Post