ఒక్క సంతకంతో లక్షల మంది భవిష్యత్ అగమ్యగోచరం?

September 06, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లుగానే ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఎరైవల్‌’ పధకాన్ని రద్దు చేస్తూ సంబంధిత ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. గత నాలుగైదు దశాబ్దాలలో భారత్ తో సహా అనేక దేశాల ప్రజలు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. కనుక వారి పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. అక్కడే పుట్టిపెరిగిన వారికి ఇబ్బందేమీ లేదు కానీ వారి మాతృదేశంలో పుట్టి పసితనంలోనే తల్లితండ్రులతో కలిసి అమెరికా వచ్చి అక్కడే పెరిగి పెద్దవారయిన సుమారు 8 లక్షల మంది భవిష్యత్ ట్రంప్ సర్కార్ తీసుకొన్న తాజా నిర్ణయంతో అగమ్య గోచరంగా మారబోతోంది. వారిలో సుమారు 20,000 మందికి పైగా భారత సంతతికి చెందినవారున్నారు. 2007 సం.లోగా 15ఏళ్ళ లోపు వయసుండి తల్లితండ్రులతో కలిసి అమెరికా వచ్చిన పిల్లలకు ఈ సమస్య గుదిబండగా మెడకు చుట్టుకొంది.  

ఆ విధంగా తమ తల్లి తండ్రులతో కలిసి అమెరికాలో అడుగుపెట్టిన వారందరూ ‘డ్రీమర్స్’ గా పిలువబడుతుంటారు. వారికి ఉజ్వల భవిష్యత్ కల్పించడం కోసమే తల్లి తండ్రులు వారిని తమ వెంట అమెరికా తీసుకువచ్చినట్లు అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇంతవరకు వారికి ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఎరైవల్‌’ పధకం క్రింద వారందరికీ తాత్కాలికంగా జారీ చేస్తున్న వర్క్ పర్మిట్స్ కూడా రద్దు అవుతాయి. కనుక ఇక నుంచి వారందరూ అమెరికాకు అక్రమంగా వలస వచ్చినవారిగానే పరిగణించబడతారు. ఒకవేళ వారు స్వదేశాలకు తిరిగి వెళ్ళకపోతే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి 6వ తేదీ తరువాత నుంచి వారికి అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు వీలు ఉండదు.

ట్రంప్ సర్కార్ తీసుకొన్న నిర్ణయం చాలా వివాదస్పదమైనదేనని అర్ధం అవుతోంది. పసితనంలో తల్లి తండ్రుల వెంటవచ్చిన పిల్లలు ఉజ్వల భవిష్యత్ కోసమే వచ్చారనే వాదనే అర్ధరహితంగా ఉంది. ఏ దేశంలోనైనా పిల్లలు యుక్తవయసు వచ్చే వరకు తమ తల్లి తండ్రుల మీదనే ఆధారపడతారు కనుకనే వారు తమ తల్లితండ్రుల వెంట అమెరికా వచ్చారు తప్ప ఉజ్వల భవిష్యత్ దొరుకుతుందని కాదు. వారి తల్లి తండ్రులు అక్కడే స్థిరపడినందున వారు కూడా అక్కడే పెరిగి, అక్కడే చదువుకొంటూ తాము అమెరికన్లమనే భావనతోనే ఉంటారు. వారి మూలాలు వేరే దేశాలలో ఉన్నప్పటికీ వారికి మాతృదేశాల కంటే అమెరికాతోనే చిక్కటి అనుబందం ఏర్పరచుకొని ఉంటారు. ఇప్పుడు వారిని అక్రమ వలసదారులని, వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పడం ఎవరూ జీర్ణించుకోలేరు. ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో చాలా చోట్ల నిరసనలు మొదలయ్యాయి. చివరికి ఈ సమస్య ఎక్కడకి దారి తీస్తుందో..ఏవిధంగా ముగుస్తుందో ఎవరూ ఊహించలేరు. 

Related Post