తెరాస పాలన పట్ల ఎన్.ఆర్.ఐ.లు అసంతృప్తి?

July 14, 2017
img

తెరాస పాలన పట్ల విదేశాలలో స్థిరపడిన తెలంగాణావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. వలసల కారణంగా రాష్ట్రంలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు గట్టిగ ప్రయత్నించవలసిన సమయంలో ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగిరాలని ప్రయత్నించినట్లు ఆయన నెలరోజుల పాటు అమెరికాలో పర్యటించి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విస్తరించడానికి శాఖలు ఏర్పాటు చేశారు. 

ఇటీవల అమెరికా నుంచి తిరిగివచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అమెరికాలో 21 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎన్నారై విభాగాలు ఏర్పాటు చేశాము. ఆ సందర్భంగా వారికి రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులను వివరిస్తే వారు ఆశ్చర్యపోయారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో అభివృద్ధి జరుగడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. కేసీఆర్ పాలనపట్ల ఎన్నారైలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నయీం కేసులు, మియాపూర్ భూకుంభకోణం కేసుల గురించి వారు ఆరా తీశారు. తెరాస సర్కార్ మూడేళ్ళ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెరాస సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా పోరాడాలని వారు సూచించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయం తెలుసుకోవడానికి వారు చాలా ఆసక్తి కనబరిచారు. కానీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదని చెప్పాను” అని మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

యూపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు షీలా దీక్షిత్ ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన సంగతి బహుశః మల్లు భట్టివిక్రమార్క మరిచిపోయినట్లున్నారు. ఒకప్పుడు రాజకీయ పార్టీలు దేశానికే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు విదేశాలలో కూడా శాఖలు ప్రారంభించడంతో ఎన్నారైలను కూడా పార్టీలు వారిగా చీల్చుకొంటున్నాయి. 

విదేశాలలో ఉన్న ఎన్నారైలకు సాధారణంగా మాతృరాష్ట్రాల పట్ల ఎనలేని మమకారం కనబరుస్తుంటారు. రాష్ట్రం కోసం తమ వంతు ఉడతాభక్తిగా ఏదైనా చేద్దామని ప్రయత్నిస్తుంటారు. రాష్ట్రాభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం రాజకీయ పార్టీలు వారి సహాయసహకారాలు ఉపయోగించుకొంటే మంచిదే. కానీ మాతృభూమికి, ఆత్మీయులకు దూరంగా జీవిస్తున్న వారి మనసులను రాజకీయాలతో కలుషితం చేసి వారిని పార్టీలవారిగా చీల్చాలనుకోవడం సరికాదు. దాని వలన ఆ పార్టీలకు ఏమైనా మేలు కలుగుతుందేమో కానీ వారికీ, రాష్ట్రానికి ఎటువంటి మేలు జరుగదు. కనుక అటువంటి ప్రయత్నాలు చేసే నేతలను ఎన్నారైలు కూడా దూరంగా ఉంచితే మంచిది.  

Related Post