ట్రంప్ అభిశంసనకు నోటీస్?

July 14, 2017
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడిచినా ఇంకా నిత్యం ఏవో ఒక సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తూనే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించేందుకు ఆయన రష్యా సహాయసహకారాలు స్వీకరించారని, తద్వారా కీలకమైన ఈ ఎన్నికల ప్రక్రియలో ఇతరదేశాల జోక్యం చేసుకొనేందుకు వీలుకల్పించారని ఆరోపిస్తూ ఆయనను కాంగ్రెస్ (అమెరికన్ పార్లమెంటు)లో అభిశంసించాలని కోరుతూ డెమొక్రాట్ ఎంపి బ్రాడ్ షెర్మాన్ ఒక తీర్మానం ప్రవేశపెట్టగా ఆ పార్టీకే చెందిన మరో సభ్యుడు అల్ గ్రీన్ దానిని సమర్ధిస్తూ సంతకం చేశారు. ఇటువంటి కారణంతో దేశాద్యక్షుడిని అభిశంసించాలనే తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అయితే కాంగ్రెస్ లో రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది కనుక ఈ తీర్మానం వీగిపోతుంది.

దీనిపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ‘అధ్యక్ష ఎన్నికలలో నా ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్ గెలవాలని రష్యా కోరుకొంది. ఎందుకంటే బలహీనురాలైన ఆమె అధ్యక్షురాలిగా ఉంటే తమకు మంచిదని రష్యా భావించడం సహజం. కానీ దాని అంచనాలను తలక్రిందులు చేస్తూ అమెరికా ప్రజలు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. మనం రష్యాతో స్నేహంగా ఉన్నప్పటికీ మన దేశప్రయోజనాలు, భద్రతే నాకు ముఖ్యం. కనుక రష్యాతో లులూచీ పడ్డాననే విమర్శలు అర్ధరహితం,” అని ట్రంప్ అన్నారు.    

Related Post