అమెరికా ఫస్ట్..అదే మన వైఖరి: ట్రంప్

January 21, 2017
img

భారత కాలమాన ప్రకారం  శుక్రవారం రాత్రి 10.30 గంటలకు డోనాల్డ్ ట్రంప్ (70) అమెరికా దేశ 45 అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంలో తన ప్రాధాన్యతలను వివరిస్తూ, తన ప్రభుత్వం తీసుకోబోయే ఏ నిర్ణయమైనా “అమెరికా ఫస్ట్” అనే నియమానికి అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన మొట్ట మొదటి ప్రసంగంలోనే ఉద్యోగాలు, విదేశీ విధానం, ఉగ్రవాదం పట్ల తన ప్రభుత్వ వైఖరి ఏవిధంగా ఉండబోతోందో కుండబద్దలు కొట్టినట్లు మళ్ళీ మరొక్కమారు చెప్పడం విశేషం. ఆయన ప్రసంగంలో హైలైట్స్:

1. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వానికి లేదా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జరుగుతున్న అధికార మార్పిడి మాత్రమే కాదు. ప్రభుత్వం నుంచి అధికారం ప్రజలకు బదిలీ అవుతున్న రోజు ఇది. కనుక ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది.

2. ఇంతకాలం కేవలం కబుర్లు చెప్పే ప్రభుత్వాలనే మనం చూశాము. ఇక నుంచి ప్రజల కోసమే పని చేయబోయే ప్రభుత్వాన్ని మీరు చూడబోతున్నారు. ఇక ఒట్టి మాటలుండవు..అన్నీ చేతలే.   

3. ఇంతకాలం మన అమెరికన్ల ఉద్యోగాలను, దేశ సంపదను ఉపయోగించుకొని చాలా సంస్థలు, చాలా దేశాలు బాగుపడ్డాయి. ఇంతవరకు పాలించిన మన ప్రభుత్వాలు మన అభివృద్ధిని పణంగా పెట్టి మరీ వారి అభివృద్ధికి సహకరించాయి. కానీ ఇక నుంచి ఆవిధంగా జరుగదు. ఏ విషయంలోనైనా ముందు అమెరికా ఫస్ట్..అదే మన వైఖరి. అది ఉద్యోగాల విషయంలో కావచ్చు..విదేశీ విధానంలో కావచ్చు మరేదైనా కావచ్చు. దేనిలోనైన మన దేశానికి, ప్రజలకు పూర్తి ప్రయోజనం ఉండి తీరాలి. అదే మన సిద్దాంతం.

4. ఇంతకాలం సాధారణ అమెరికన్ ప్రజలు తీవ్ర వివక్షకు, నిర్లక్ష్యానికి గురయ్యారు. వారికి దక్కవలసి ఉద్యోగాలు, హక్కులు, అభివృద్ధి అన్నీ వేరేవరెవరికో దక్కాయి. కానీ వీదిన పడుతున్న సగటు అమెరికన్లను అటు ప్రభుత్వం కానీ సంస్థలు గానీ పట్టించుకోలేదు. ఆ కారణంగా అనేక లక్షల మంది అమెరికన్లు, వారిపై ఆధారపడిన కుటుంబాలు దయనీయమైన జీవితాలు గడుపుతున్నారు. ఇక నుంచి వారి అభివృద్ధి, వారి సంక్షేమమే నా ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉంటుంది. 

5. ఇంతవరకు మనం ప్రపంచంలో ఎక్కడెక్కడి దేశాల సరిహద్దులనో కాపాడుతూ మన దేశాభివృద్ధిని నిర్లక్ష్యం చేశాము. అమెరికా సృష్టిస్తున్న సంపదను, అమెరికన్ సైనికుల ప్రాణాలను వాళ్ళ కోసం త్యాగాలు చేశాము. ఇక నుంచి అలాగ జరుగబోదు. మన దేశాభివృద్ది కంటే మరేది మనకు ముఖ్యం కాదు. అదే మన మొదటి ప్రాధాన్యత మన దేశాభివృద్ధి, మన ప్రజల సంక్షేమమే.

6. మళ్ళీ రోడ్లు, వంతెనలు, విమానాశ్రయాలు వగైరాలన్నీ నిర్మించుకొందాము. వాటి ద్వారానే మన అమెరికన్లకి ఉద్యోగాలు సృష్టించుకొందాము. అన్ని రంగాలాలో అమెరికాను అభివృద్ధి చేసుకొని మళ్ళీ పూర్వ వైభవం సాధించి, ప్రపంచ దేశాలలో అమెరికాను మళ్ళీ అగ్రరాజ్యంగా నిలబెట్టుకొందాము.

7. ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఈ భూమ్మీద కనబడకుండా చేద్దాం.   

8. అమెరికాను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ వంటి రకరకాల మొండి సమస్యలను సమూలంగా తుడిచిపెట్టేసి మళ్ళీ అమెరికాను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలబెట్టడమే నా ప్రభుత్వ ధ్యేయం.

9. అమెరికా జెండా పట్ల విధేయత చూపే నల్లవారు, తెల్లవారు, ఇతర వర్ణాలవారు అందరూ అమెరికన్లే. అందరం కలిసికట్టుగా అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుదాం. 

10. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రమాణస్వీకారం ఒక అధికారిక కార్యక్రమం కావచ్చు. కానీ ఇది మన దేశ ప్రజలందరిపట్ల నేను విధేయత చూపిస్తానని, మీ అందరి సంక్షేమం కోసమే పని చేస్తానని మాటిస్తున్నట్లుగానే  మీరు భావించవచ్చు.

11. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ అమెరికా. గాడ్ బ్లెస్ అమెరికా.

Related Post