ఇక అమెరికా మోజు తగ్గించుకొంటే మంచిదేమో?

January 06, 2017
img

అమెరికా అంటే ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు, ఉజ్వల భవిష్యత్ కి కేరాఫ్ అడ్రస్స్ కావడంతో భారత్ తో సహా అనేక దేశాల నుంచి గత 4 దశాబ్దాలుగా అనేక లక్షల మంది అమెరికా వెళుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు ఇదివరకు అంతటి సానుకూలంగా, ఆరోగ్యకరంగా లేవని ప్రవసభారతీయులే చెపుతున్నారు. త్వరలో అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికన్ పౌరులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు దక్కేవిధంగా అమెరికా విధివిధానాలలో బారీ మార్పులు చేయబోతున్నారు. హెచ్-1బి వీసాల జారీ విషయంలో ఇటీవల రిపబ్లికన్ పార్టీ సభ్యులు కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన బిల్లు ఆ దిశలో మొదటి అడుగుగా భావించవచ్చు.

ఉద్యోగాల విషయంలో ట్రంప్ ఇప్పుడే కటిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఉన్నత విద్యలభ్యసించేందుకు అమెరికా వస్తున్న వివిద దేశాల విద్యార్ధులకు గత ఏడాది నుంచే సమస్యలు మొదలయ్యాయి. గుర్తింపులేని విద్యాసంస్థలలో చేరేందుకు గత ఏడాది అమెరికాకు చేరుకొన్న అనేక మంది భారతీయ విద్యార్ధులను విమానాశ్రయాల నుంచే వెనక్కి త్రిప్పిపంపేయడం అందరూ చూశారు. 

అమెరికాలోనే ఉన్నత విద్యలభ్యసించాలనే విదేశీ విద్యార్ధుల బలహీనతను సొమ్ము చేసుకొంటూ అమెరికాలో అనేక కాలేజీలు, యూనివర్సిటీలు ప్రభుత్వ నిబందనలను అతిక్రమించి వారికి అడ్మిషన్లు ఇచ్చి కోట్లాది డాలర్లు సంపాదించుకొంటున్నాయి. అదే సమయంలో అమెరికా ప్రభుత్వం నుంచి చాలా బారీగా నిధులు అందుకొంటున్నాయి. ఈ అవకతవకలను గుర్తించిన అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విద్యాశాఖను అప్రమత్తం చేయడంతో, అది ఈ అవినీతి, అక్రమాలకు వీలుకల్పిస్తున్న “అక్రిడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్” (ఏసిఐసిఎస్) గుర్తింపును రద్దు చేసింది. దానితో ఆ సంస్థ గుర్తింపునిచ్చిన సుమారు 245 విద్యాసంస్థల గుర్తింపు రద్దు అయ్యింది. 

ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, కామర్స్, వైద్య తదితర రంగాలకు చెందిన ఆ కళాశాలలో అనేక వేలమంది భారతీయ విద్యార్ధులు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఆ సంస్థలకు విద్యాశాఖ ఇచ్చిన 18నెలల గడువు కూడా పూర్తికావస్తోంది. అవన్నీ మళ్ళీ విద్యాశాఖకు దరఖాస్తు చేసుకొన్నాయి. వాటిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, నిబంధనలకులోబడి పనిచేసేందుకు సిద్దపడేవాటిని గుర్తించి వాటికి మాత్రమే గుర్తింపునిస్తామని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. కనుక గుర్తింపు కోల్పోయిన, అలాగే ఇక ముందు గుర్తింపు దక్కని ఆ కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుకొంటున్న విద్యార్ధులకు సమస్యలు తప్పకపోవచ్చు. 

అమెరికాలో ప్రవాసభారతీయులు ఏర్పాటు చేసుకొన్న సంఘాల ప్రతినిధులు ఈ సమస్య పరిష్కరం కోసం కృషి చేస్తున్నారు. భారతీయ విద్యార్ధులు నష్టపోకుండా ఉండేందుకు వారిని గుర్తింపు కలిగి ఉన్న వేరే ఇతర కాలేజీలకు బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఉద్యోగాలు, ఉన్నత విద్యల విషయంలో ఎదురవుతున్న ఈ సమస్యలన్నిటినీ చూస్తుంటే భారతీయులు అమెరికా మోజు తగ్గించుకొని, ఉన్నత విద్యా, ఉద్యోగాలలో భారత్ లో నానాటికీ పెరుగుతున్న అపార అవకాశాలను అందిపుచ్చుకొంటే మంచిదనిపిస్తోంది. 

Related Post