ప్రవాస భారతీయులు హోషియార్!

December 09, 2016
img

బంగారు భవిష్యత్ వెతుకొంటూ అయినవాళ్ళని, ఆత్మీయులని, తాము ఎంతగానో ప్రేమిస్తున్న మాతృభూమిని అన్నిటినీ వదిలిపెట్టి అనేకమంది భారతీయులు విదేశాలకి వెళుతుంటారు. దేశం కాని దేశంలో ప్రవాస భారతీయులు ఎప్పుడూ చాలా జాగ్రత్తగానే మసులుకొంటుంటారని చెప్పవచ్చు. కానీ ఒక్కోసారి దురదృష్టవశాత్తు కొంతమంది ఊహించని ప్రమాదాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకొంటుంటారు లేదా తీవ్ర గాయాలపాలై ఖరీదైన వైద్యం పొందవలసి ఉంటుంది. 

అంతవరకు పూలనావల సాగిపోతున్న వారి జీవితాలు, వారిపై ఆధారపడిన భార్యా, పిల్లలు లేదా తల్లి తండ్రులు, ఆత్మీయుల జీవితాలు నరకం అవుతాయి. దేశం కాని దేశంలో ఏమి చేయాలో, ఎవరిని సహాయం అర్ధించాలో తెలియని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ కష్టాలు, కన్నీళ్ళు ఎవరూ కూడా ఊహించలేరు... భరించలేరు..తీర్చలేరు కూడా. ఊహించని విధంగా ఎదురయ్యే అటువంటి సమస్యలని ఎదుర్కోవడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే ఆ కష్టకాలంలో కొంత ఊరట లభిస్తుంది.  

1. అటువంటి అత్యవసర పరిస్థితులని ఎదుర్కొనేందుకు తగినంత విలువగల మెడికల్ మరియు జీవిత భీమా పాలసీలు తీసుకోవడం చాల అవసరం. వాటిలో తప్పనిసరిగా తమ కుటుంబ సభ్యుల పేర్లని జత చేయడం కూడా అంతే అవసరం. ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి ఏ రెస్టారెంటుకో వెళ్ళి చేసే ఖర్చుపాటి కూడా ఉండదు మంత్లీ టర్మ్ పాలసీకి చెల్లించవలసిన ప్రీమియం. ఎప్పుడైనా జరుగరానిది జరిగితే అప్పుడు వారి కుటుంబానికి ఆ పాలసీయే రక్షణ కవచంలాగ ఆదుకొంటుంది. కానీ అనేక కారణాల చేత అతిముఖ్యమైన ఈ పాలసీలని తీసుకోవడంలో చాలా మంది అశ్రద్ధ చూపిస్తుంటారు. 

2. అదేవిధంగా భార్యాభర్తలు, వీలైతే పిల్లలు పేర్లని కూడా తమ బ్యాంక్ అకౌంట్లలో జాయింట్ చేయించుకోవడం. భారత్ లో ఇప్పటికే చాలా మంది ఈ పద్ధతినే అవలంభిస్తున్నారు. మాతృదేశానికి, అత్మీయులకి చాలా దూరంగా విదేశాలలో ఉంటున్నవారు ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదు. లేకుంటే బ్యాంక్ అకౌంటులో కోటి రూపాయలు ఉన్నప్పటికీ అది ఆపత్సమయంలో బయటకి తీసి వాడుకొనే అవకాశం ఉండదని గ్రహించాలి.   

3. వీలునామా వ్రాయడం భారతీయులు ఆశుభంగా భావిస్తుంటారు. అది కేవలం వృద్ధాప్యంలోనే చేయవలసిన పని అనే అపోహ చాలా బలంగా ఉంటుంది. కానీ విదేశాలలో స్థిరాస్తులున్నవారు, ఒకవేళ తమకి ఏదైనా జరుగరానిది జరిగినట్లయితే వాటి కోసం తమ కుటుంబ సభ్యులు అక్కడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదనుకొంటే తప్పనిసరిగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నపుడే వీలునామా వ్రాసి దానిని రిజిస్టర్ చేయించడం చాలా మంచిది.     

4. విదేశాలలో ప్రతీ చోట ప్రవాస భారతీయుల సంఘాలు ఉన్నాయి. వాటిలో సభ్యత్వం తీసుకోవడం కూడా చాల మంచిది. తద్వారా ఆపత్సమయాలలో వారందరి సహాయసహకారాలు లభిస్తాయి. 

5. ప్రవాస భారతీయులు చాలా మంది ఆపదలలో చిక్కుకొన్నవారికి యధాశక్తిన సహాయపడుతుంటారు. ఆ సమయంలో తోటి భారతీయులు లేదా స్నేహితులు లేదా ఆత్మీయులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కళ్ళారా చూస్తుంటారు. కనుక ఒకవేళ దురదృష్టవశాత్తు అటువంటి కష్టం ఆపద తమకే వస్తే...తమ కుటుంబం పరిస్థితి ఏమిటి? అని ఒక్కసారి ఆలోచించడం చాలా అవసరం. తమపై ఆధారపడినవారికి అటువంటి కష్టం రాకూడదనుకొంటే, ముందుగానే అందుకు తగ్గట్లుగా పైన చెప్పుకొన్న జాగ్రత్తలన్నీ తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో ఇంకా మంచి సలహాల కోసం నిపుణులు లేదా స్నేహితుల సలహాలు తీసుకోవడం మంచిదే. 

Related Post