ట్రంప్ విజయానికి కారణమైన తెలుగు వ్యక్తి

November 10, 2016
img

అమెరికా అధ్యక్ష పదవికి చాలా భీభత్సంగా జరిగిన ఎన్నికలని అందరం చూశాము. వాటిలో ట్రంప్ తప్పకుండా ఓడిపోవడం ఖాయం అని నమ్మినవారు కొన్ని లక్షల కోట్లు మంది ఉన్నారు. ఎన్నికల ఫలితాలు కూడా మొదటి నుంచి అలాగే సాగాయి. కానీ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని తలపించిన ఆ ఎన్నికలలో అందరి అంచనాలని తారుమారు చేస్తూ చివరికి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అయన ఆ విజయం సాధించడానికి తెర వెనుక ఎందోరో రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ఎంతో కృషి చేశారు. 

ట్రంప్ విజయం సాధించిన తరువాత మొట్టమొదటిసారి న్యూయార్క్ లో ప్రసంగిస్తూ తన విజయం కోసం కృషి చేసినవారినందరినీ పేరుపేరునా పిలిచి అందరికీ వారిని పరిచయం చేసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. వారిలో అవినాష్ ఇరగవరపు కూడా ఒకరు. 

ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం మండలం లోని ముమ్మిడివరపు గ్రామం. ఐ.ఐ.ఎం. లక్నోలో ఎం.బి.ఏ. చేసిన తరువాత హెచ్.సి.ఎల్. టెక్నాలజీ లిమిటెడ్, న్యూడిల్లీలో కొంత కాలం పనిచేశారు. మొదటి నుంచి రాజకీయాలపై చాలా ఆసక్తి ఉన్న కారణంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తరువాత ఆరిజోనా రాష్ట్రంలో ఇంటెల్ సంస్థలో పనిచేస్తున్న తన భార్యని శలవులలో కలవడానికి 2014లో అమెరికా వచ్చారు. అదే ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. 

సరిగ్గా అదే సమయంలో ఆరిజోనా గవర్నర్ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయాల పట్ల చాలా ఆసక్తి ఉన్న అవినాష్, అక్కడి స్థానిక పరిస్థితులు, ఓటర్లు, అభ్యర్ధులు, వారి సమస్యలు, అవసరాలు మొదలైన అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేసి గవర్నర్ పదవికి పోటీ పడుతున్న డౌగ్ డ్యూసికి కోసం ఒక ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచించి ఇచ్చారు. అది ఆయనకి చాలా నచ్చడంతో అవినాష్ ని ప్రచార బృందంలోకి తీసుకొన్నారు. డాటా అనలిస్టుగా తనకున్న అనుభవంతో డౌగ్ డ్యూసికి అవసరమైన సహాయసహకారాలు అందించారు. ఊహించినట్లుగానే ఆయన ఘనవిజయం సాధించారు. అప్పుడే అవినాష్ డాటా విశ్లేషణ సామర్ధ్యం గురించి అందరికీ తెలిసింది. ఆరిజోనా జి.ఓ.పి. చైర్మన్ రాబర్ట్ గ్రాహం చాలా ప్రశంసించారు. 

అప్పటి నుంచి అవినాష్ వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితి కలుగలేదు. ఆరిజోన జి.ఓ.పి. రాజకీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆ రాష్ట్ర రాజకీయాలని, ఎన్నికలలో కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రతిభ గుర్తించిన రిపబ్లికన్ పార్టీ ఈసారి డోనాల్డ్ ట్రంప్ ప్రచార బృందంలో బాధ్యతలు అప్పగించగా దానిని ఆయన చాలా సమర్ధంగా నిర్వహించి ట్రంప్ ప్రశంశలు అందుకొన్నారు. 

ఈ ఎన్నికలలో అవినాష్ కేవలం ఆరిజోనా రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువగా ఏ అంశం గురించి చర్చించుకొంటున్నారు? వారు ఏ పదాలు ట్రంప్ నోట వినాలనుకొంటున్నారు..వంటి డాటాని సేకరించి ట్రంప్ ప్రసంగాలని తయారు చేసే బృందానికి అందించేవారు. అవినాష్ అందిస్తున్న ఆ డాటా ఆధారంగా వారు ట్రంప్ ప్రసంగాలు తయారుచేసేవారు. ‘అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే’, ‘అమెరికా ఫస్ట్’ వంటి అనేక పదాలు ఆవిధంగా పుట్టుకొచ్చినవే. చివరికి అవే ట్రంప్ ని విజేతగా నిలపడం అందరూ చూశారు. అవినాష్ కృషి వలన ఆరిజోనాలో రిపబ్లికన్ పార్టీ మొత్తం 47 స్థానాలు దక్కించుకొంది. ఆ విజయం వెనుక అవినాష్ కృషి ఉందని వేరే చెప్పనవసరం లేదు..    

డోనాల్డ్ ట్రంప్ పట్ల యావత్ ప్రపంచ ప్రజలలో.. ముఖ్యంగా భారతీయులలో వ్యతిరేకత ఉన్న సంగతి అవినాష్ కి తెలుసు. ఆయన ట్రంప్ కి చాలా సన్నిహితంగా పనిచేశారు కనుక ట్రంప్ గురించి వివరిస్తూ “నేను ఇండియా నుంచి హెచ్-4 వీసాపై వచ్చానని ట్రంప్ కి తెలుసు. అందరూ ఊహిస్తున్నట్లు ఆయన చెడ్డవారేమీ కాదు. ఆయన కేవలం చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిని, ఆవిధంగా స్థిరపడిన వారిని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఆయన నా పట్ల ఎప్పుడూ చాలా స్నేహభావమే ప్రదర్శించేవారు. నామినేషన్ వేసే సమయంలో నేను కూడా పక్కన ఉండాలని పట్టుబట్టి తీసుకువెళ్ళారు,” అని అన్నారు. 

డోనాల్డ్ ట్రంప్ అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవి సాధించడం వెనుక ఒక తెలుగువ్యక్తి ఉండటం తెలుగువారికీ, భారతీయులకీ అందరికీ గర్వకారణమే.  


Related Post